రాయితీలు.. ఆర్థిక వృద్ధే లక్ష్యం!
బడ్జెట్‌పై వివిధ సంస్థల వినతి
l పన్నుల వ్యవస్థలో మార్పు: కేర్
l పన్ను మినహాయింపులు కావాలి: ఎస్‌బీఐ
l ద్రవ్యలోటు లక్ష్యం పెరుగుతుంది: గోల్డ్‌మన్
l పసిడిపై పన్నుల భారం తగ్గించాలి: డబ్ల్యూజీసీ
ముంబై: కేంద్ర బడ్జెట్ సమయం ఫిబ్రవరి 1వ తేదీ దగ్గరపడుతుండడంతో, దీనిపై పలు విశ్లేషణా, అధ్యయన సంస్థల నుంచి వివిధ రంగాల్లో నిపుణుల వరకూ విభిన్న అంచనాలు వెలువడుతున్నాయి. పన్నుల వ్యవస్థలో మార్పులు ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ– కేర్ పేర్కొంది. ఆర్థిక వృద్ధి అవసరమని, ఇందుకు ఐటీలో మినహాయింపులు కావాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్‌బీఐ పేర్కొంటే, ద్రవ్యలోటు కట్టు తప్పడం ఖాయమని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్సీసెస్ సంస్థ– గోల్డ్‌మన్ శాక్స్ విశ్లేషించింది. ఇక పసిడి వ్యాపారంలో పారదర్శకతను పెంచాలని ప్రపంచ పసిడి మండలి డిమాండ్ చేసింది. వేర్వేరుగా ముఖ్యాంశాలు చూస్తే...
అదనపు ఆదాయం లక్ష్యం
వ్యక్తులు, కార్పొరేట్లకు సంబంధించి పన్నుల వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రెవెన్యూ పెంపు ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండవచ్చు. పరోక్ష పన్నులకు సంబంధించిన వ్యవస్థ జీఎస్‌టీకి కొంత దగ్గరకు జరిగే విధంగా బడ్జెట్ రూపొందించే అవకాశం ఉంది. సేవలపై ప్రభుత్వ లెవీ పన్ను 12 నుంచి 18 శాతంగా ఉండవచ్చు. కాగా ప్రత్యక్ష పన్నుల విషయంలో కార్పొరేట్ పన్నును కేంద్రం తగ్గించవచ్చు. వచ్చే నాలుగేళ్లలో ఈ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడానికి రోడ్ మ్యాప్ ఉంటుందని భావిస్తున్నాం. కొన్ని మినహాయింపులను రద్దుచేస్తూ... తొలిదశగా ఈ రేటును 27.5 శాతానికి తగ్గించవచ్చు. రెవెన్యూ వ్యయాల విషయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది 17.31 లక్షల కోట్లు ఉంటే, ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10–15 శాతానికి పెరిగే వీలుంది. ఇక మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ యాక్ట్‌కు సంబంధించి వ్యయాలను 10% వరకూ పెంచవచ్చు.
3 లక్షలకు ఐటీ మినహాయింపు పరిమితి పెంపు!
ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపుల పరిమితులను పెంచాలని ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ ఒక నివేదికలో కోరింది. ఈ పరిమితి ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతారని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి చర్య తీసుకుంటే 75 లక్షల మంది ఆదాయపు పన్ను మినహాయింపు పొందగలుగుతారని పేర్కొంది. సెక్షన్ 80 సీ కింద పరిమితిని ప్రస్తుత రూ.1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచుతారన్నది అంచనాగా తెలిపింది. గృహ రుణంపై వడ్డీ మినహాయింపును రూ. 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతారని భావిస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకుల్లో స్థిర డిపాజిట్ల లాకిన్ కాలాన్ని ఐదేళ్ల నుంచి 3 సంవత్సరాలకు తగ్గించాలన్నది గత కొంత కాలంగా బ్యాంకింగ్ చేస్తున్న విజ్ఞప్తిగా వివరించింది. అలాగే వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యం పెరిగే అవకాశం ఉందనీ, ఇది 3.4 శాతంగా (5.74 లక్షల కోట్లు) ఉండవచ్చని నివేదిక అంచనావేసింది.
3.4 శాతం వరకూ ద్రవ్యలోటు...: గోల్డ్‌మన్ శాక్స్
మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాలను కేంద్రం మార్చే వీలుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేసింది. ఈ లోటు 3.3% నుంచి 3.4 శాతం మధ్య ఉంటుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే 3.5 శాతం (రూ.5.33 లక్షల కోట్లు) దాటకూడదన్నది బడ్జెట్ లక్ష్యం.
పసిడి పన్నులను తగ్గించాలి: డబ్ల్యూజీసీ
రానున్న బడ్జెట్‌లో పసిడిపై పన్నులను కేంద్రం ప్రస్తుత భారీ 13 శాతం నుంచి తగ్గించాలని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనివల్ల దేశంలోకి పసిడి అక్రమ రవాణా తగ్గుతుందని, స్థానిక పసిడి వాణిజ్యంలో పారదర్శకత మెరుగుపడుతుందని విశ్లేషించింది. ప్రస్తుతం పసిడిపై 10 శాతం కస్టమ్స్ సుంకం ఉంది. ఎక్సైజ్ సుంకం 1 శాతం. వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ 1.5 శాతం. ఈ రంగంలో పారదర్శకతను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే, కేంద్రం తప్పనిసరిగా పసిడిపై పన్నుల తీరును సమీక్షించాలని డబ్ల్యూజీసీ భారత్ కార్యకలాపాల చీఫ్ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ‘‘జీఎస్‌టీ వ్యవస్థలో 3 నుంచి 6 శాతం పన్ను ఉంటుందని భావిస్తున్నారు. కస్టమ్స్ సుంకం 10 శాతంగా కొనసాగితే, యల్లోమెటల్‌పై మొత్తం పన్ను 13 నుంచి 16 శాతంగా ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. ఇదే జరిగితే దేశంలో మరింత పసిడి అక్రమ వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందని, దీనికి తావివ్వడం తగదు’’ అని విశ్లేషించారు.