ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆశలు..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఎక్కువగా ప్రభావితమైన ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు బడ్జెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. వినియోగదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచే విధంగా బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నాయి.
ఉద్దీపన చర్యలు
వినియోగదారుల నమ్మకాన్ని పెంచే ఉద్దీపన చర్యలు బడ్జెట్‌లో ఉంటాయని భావిస్తున్నాం. క్రియాశీలక సంస్కరణలు మధ్యతరగతి, గ్రామీణ ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి పెంచడం ద్వారా డిమాండ్ పుంజుకుంటుంది. దీంతో ఎఫ్‌ఎంసీజీ రంగం వృద్ధి పరంగా పట్టాలెక్కుతుంది. – వివేక్ గంభీర్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ
వృద్ధి ఆధారిత బడ్జెట్
వినియోగాన్ని, ప్రజల పెట్టుబడులను, డిజిటైజేషన్‌ను, పన్నుల పరిధిని పెంచడం ద్వారా అధిక వృద్ధి సాధించే విధంగా బడ్జెట్ ఉంటుంది. గార్, పీఓఈఎం, జీఎస్టీ వంటి విధానాలపై బడ్జెట్‌తో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇతర అన్ని బడ్జెట్‌ల మాదిరిగా లోటును అడ్డుకట్ట వేయడం, అధిక వృద్ధిని సాధించడం అన్నది ప్రస్తుతానికి సవాలే. కనీస పన్ను మినహాయింపు వంటి పలు చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నాం. – ఎన్‌హెచ్ బన్సాలీ, ఇమామీ సీఎఫ్‌వో
ఆయుర్వేద ఉత్పత్తులపై తక్కువ పన్ను
ఆయుర్వేద ముడి పదార్థాలతో తయారు చేసిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం సంతోషకరం. చాలా వరకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఇటీవలి కాలంలో ఈ విభాగంలోకి అడుగుపెట్టాయి. ఆయుర్వేద ముడి పదార్థాలతో తయారయ్యే ఉత్పత్తులను జీఎస్టీలో చాలా తక్కువ పన్ను రేటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. – ప్రదీప్ చోలాయిల్, చోలాయిల్ లిమిటెడ్ (మెడిమెక్స్ తయారీ) ఎండీ