ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్ విలీనం మంచిదే!
♦ కేంద్రానికి లాభమని సీఎల్‌ఎస్‌ఏ అంచనా
♦ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం నెరవేరుతుంది
న్యూఢిల్లీ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)లో మెజారిటీ వాటాను ఓఎన్‌జీసీ కొనుగోలు చేస్తే ప్రధానంగా ప్రయోజనం పొందేది కేంద్ర ప్రభుత్వమేనని బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. దీని ద్వారా ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం సులభంగా నెరవేరనుందని సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయం. అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడే ఓ అతిపెద్ద ఇంధన సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల వెల్ల డించిన విషయం తెలిసిందే. ఇంధన ఉత్పత్తి నుంచి విక్రయం వరకూ సమగ్ర కార్యకలాపాలను నిర్వహించే ఒక కంపెనీ ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా జైట్లీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌పీసీఎల్‌లో వాటాను ప్రభుత్వరంగంలోని ఓఎన్‌జీసీ కొనుగోలు చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
ఓఎన్‌జీసీ ముందున్న అవకాశాలు
హెచ్‌పీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 51 శాతం వాటాను కొనుగోలు చేయాలంటే ఓఎన్‌జీసీకి సుమారు రూ.28,300 కోట్లు అవసరం అవుతాయి. ఓఎన్‌జీసీ వద్ద రూ.16,648 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్‌లో వాటా కొనుగోలుకు గాను అదనంగా రుణాలు తీసుకోవడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఓఎన్‌జీసీకి ఈ ఏడాది మార్చి నాటికి రూ.55,682 కోట్ల రుణ భారం ఉంది. హెచ్‌పీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు రుణాలు తీసుకుంటే మాత్రం మొత్తంమీద రుణభారం అధికమవుతుందని సీఎల్‌ఎస్‌ఏ తన నివేదికలో వివంరిచింది.
హెచ్‌పీసీఎల్‌లో వాటా కొనుగోలుకు ఓఎన్‌జీసీ ముందున్న మరో ఆప్షన్... ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)లో తనకున్న 13.8 శాతం వాటాను అమ్మేయడమేనని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఐవోసీ వాటా విక్రయంతో... హెచ్‌పీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు అవసరమైనన్ని నిధులు ఓఎన్‌జీసీకి సమకూరుతాయని తెలిపింది. వాటా విక్రయిస్తే గనుక ఐవోసీ షేరు ధర ప్రభావితం కావచ్చని అభిప్రాయపడింది. ఒకవేళ విలీనం సాకారమైతే ఐవోసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత దేశంలో మూడో అతిపెద్ద రిఫైనరీ సంస్థగా ఓఎన్‌జీసీ అవతరిస్తుంది.
ఇది తొలి అడుగే
ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్ విలీనం తొలి అడుగేనని, ప్రభుత్వం ఇంధన రంగంలో ఉన్న క్రాస్ హోల్డింగ్స్(ప్రభుత్వరంగ సంస్థలు ఒకదానిలో ఒకటి వాటాలను కలిగి ఉండడం)ను నగదుగా మార్చుకోవచ్చని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. తదుపరి దశలో ఆయిల్ ఇండియాను విలీనం చేసుకోవాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం కోరవచ్చని పేర్కొంది.
ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టే
హెచ్‌పీసీఎల్‌లో కేంద్రం వాటాను ఓఎన్‌జీసీ కొనుగోలు చేస్తే ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం సులభంగా నెరవేరనుంది. అందుకే ఈ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వమే ప్రధానంగా లబ్ధి పొందనుందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.72,500 కోట్లను సమకూర్చుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్ డీల్‌తో ప్రభుత్వ నిధుల సమీకరణ లక్ష్యంలో మూడోవంతు సమకూరినట్టేనని సీఎల్‌ఎస్‌ఏ వివరించింది.