CLSA
-
మనీ పర్సుకు బైబై.. ప్రధానంగా 3 కారణాలతోనే అలా!
డిజిటల్ పేమెంట్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. 2021–22లో దేశంలో ఏకంగా 7,422 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేం ద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఒరవడి కొనసాగితే 2026కల్లా దేశంలో డిజిటల్ లావాదేవీలు లక్ష కోట్ల డాలర్లకు చేరతాయన్నది హాంకాంగ్‌కు చెంది న క్యాపిటల్ మార్కెట్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా.. ఎందుకీ డిజిటల్ చెల్లింపులు? నగదు చెల్లింపులకే ప్రాధాన్యమిచ్చే భారత ప్రజల్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి... 1. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయం జనాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించింది. అప్పటికి చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. రోజువారీ లావాదేవీల కోసం ప్రజలు డిజిటల్, ఆన్లైన్ బాట పట్టాల్సి వచ్చింది. తొలుత ఎక్కువగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే ఆన్లైన్ చెల్లింపులు జరిగాయి. 2. డిజిటల్ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం కరోనా. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్, సామాజిక దూరంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. కరోనా వల్ల బ్యాంకులు, ఆర్థికసంస్థలు విప్లవాత్మక మార్పులు చేపట్టాయి. సులువైన ఆన్లైన్ పేమెంట్లకు సురక్షిత మార్గాలు తెచ్చాయి. 2016 నాటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులకు దేశంలో పేటీఎం ఒక్కటే అందుబాటులో ఉండగా ఆ తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటివెన్నో వచ్చాయి. 3. డిజిటల్ చెల్లింపు సంస్థల మధ్య పోటీ పెరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండటం మూడో కారణం. ఇతర దేశాల్లో సౌలభ్యం కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే మన దగ్గర మాత్రం వాటి ద్వారా వచ్చే రాయితీల కోసం 60 శాతం మంది చెల్లింపులు చేస్తున్నట్లు గూగుల్–బీసీజీ సర్వేలో తేలింది. డిజిటల్ చెల్లింపులకు మార్గాలు డెబిట్, క్రెడిట్ కార్డులతో మొదలైన డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ ఆధారిత చెల్లింపులకే ఇప్పటికీ పెద్దపీట వేస్తున్నా ప్రి–పెయిడ్, ఎలక్ట్రానిక్ కార్డులు, స్మార్ట్ ఫోన్ యాప్‌లు, బ్యాంక్ యాప్‌లు, మొబైల్ వ్యాలెట్లు, పేమెంట్ బ్యాంకులు, ఆధార్ ఆధారిత పేమెంట్ పద్ధతులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (బీమ్) యాప్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ వ్యాలెట్లు ఐదు, పది రూపాయల లావాదేవీలనూ అనుమతిస్తుండటంతో తోపుడు బండ్ల నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్ల దాకా వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. 2020 అక్టోబర్‌లో 200 కోట్లున్న యూపీఐ లావాదేవీలు గత మార్చిలో 500 కోట్లకు పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న భారతీయుల సంఖ్య వచ్చే ఏడాదికల్లా 66 కోట్లకు చేరుతుందని అంచనా. మార్చిలో మారిన ట్రెండు డిజిటల్ చెల్లింపులు ఇంతలా పెరుగుతున్నా గత మార్చిలో అనూహ్యంగా నగదు చెల్లింపులు భారాగా పెరిగాయి. 2021 మార్చిలో రూ.2,62,539 కోట్ల నగదు చెల్లింపులు జరిగితే గత మార్చిలో రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వాలు పలు పథకాల కింద జనం ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుండటం, వాటిని డ్రా చేసుకోవడం ఇందుకు కారణంగా కన్పిస్తున్నాయి. ఏటీఎం నగదు విత్‌డ్రాయల్స్ కూడా 2020తో పోలిస్తే 2022 మార్చి నాటికి బాగా పెరిగాయి. ఎలా చెల్లిస్తున్నారు? భారతీయులు అత్యధికంగా యూపీఐ విధా నం వాడుతున్నారు. 2021–22లో రూ.84,17,572.48 కోట్ల విలువైన 4.5 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2020–21తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఆధార్ ఆధారిత విధానం (ఏఐపీఎస్) ద్వారా 3,00,380 కోట్ల రూపాయల విలువైన 23 కోట్ల లావాదేవీలు జరిగాయి. గత మార్చిలోనే 22.5 లక్షల లావాదేవీల ద్వారా 28,522 కోట్ల రూపాయల డిజిటల్ చెల్లింపులు జరిగాయి. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) ద్వారా 46 కోట్ల లావాదేవీల ద్వారా రూ.37,06,363 కోట్లు చేతులు మారి నట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. టోల్గేట్ చెల్లింపులు దాదాపుగా డిజిటైజ్ అయ్యాయి. 2021– 22లో 24 లక్షల ఫాస్ట్‌ట్యాగ్‌ల రూ.38,077 కోట్ల చెల్లింపులు జరిగాయి. మార్చిలో అత్యధికంగా రూ.4,000 కోట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ల ద్వారా వసూలయ్యాయి. ఇంతలా డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్నా దేశంలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో జనం నగదు చెల్లింపులకే మొగ్గుతున్నారు. అయితే ఈ దశాబ్దాంతానికల్లా డిజిటల్ చెల్లింపులు నగదు చెల్లింపులను దాటేస్తాయని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
రిలయన్స్‌కు షాకిచ్చిన బ్రోకరేజ్‌లు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, ఎడెల్వీజ్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు షాక్‌నిచ్చాయి. నిఫ్టీ ఇండెక్స్‌ను ముందుండి నడిపిస్తున్న రిలయన్స్ షేరుకు డౌన్‌గ్రేడ్ రేటింగ్‌ను కేటాయించాయి. మార్చి కనిష్టస్థాయి రూ.867.82 నుంచి రిలయన్స్ షేరు 150శాతం ర్యాలీ చేసి ఇటీవల రూ.2000 స్థాయిని అందుకుంది. ‘‘నిధుల సమీకరణ, రుణాన్ని తగ్గించుకోవడం, వ్యాపారాల వాల్యూ అన్‌లాక్ కావడంతో షేరు అధికంగా ర్యాలీ చేసింది. వాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. ఈ పరిణామాలు అప్రమత్తతకు సంకేతాలు’’ అని రెండు బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు రిలయన్స్ షేరుపై ఆయా బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలను చూద్దాం... ఎడెల్వీజ్ బ్రోకరేజ్: రిలయన్స్ షేరుకు ‘‘హోల్డ్’’ రేటింగ్‌ను కేటాయించింది. టార్గెట్ ధరను రూ.2105గా నిర్ణయించింది. రుణాలను తగ్గించుకోవడం, అసెట్ మోనిటైజేషన్, వ్యాపారంలో డిజిటల్ మూమెంట్ తదితర అంశాలు షేరును రూ.2000స్థాయిని అందుకునేందుకు తోడ్పడినట్లు ఎడెల్వీజ్ బ్రోకరేజ్ తెలిపింది. రిలయన్స్ షేరు ఏడాది ప్రైజ్ -టు -ఎర్నింగ్స్ 47.2రెట్ల నిష్పత్తి వద్ద ట్రేడ్ అవుతోందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ విలువ వాస్తవ విలువ కంటే అధికంగా ఉందని తెలిపింది. షేరు ధర పతనం ఒక క్రమపద్ధతిలో ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ బ్రోకరేజ్ సంస్థ 2016 నుంచి రిలయన్స్ షేరుపై పాజిటివ్‌గానే ఉంది. ఈ 4ఏళ్లలో షేరు 400శాతం ర్యాలీ చేసింది. సీఎల్ఎస్ఏ బ్రోకరేజ్: రిలయన్స్ షేరు రేటింగ్‌ను ‘‘అవుట్‌ఫెర్‌ఫామ్’’ నుంచి ‘‘బై’’కు కుదించింది. అయితే టార్గెట్ ధరను మాత్రం రూ.2,250కి పెంచింది. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ధరకు అతి దగ్గరలో ఉంది. మార్చి 2022 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 220 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తుంది. అయితే షేరు ర్యాలీ స్వల్పకాలంలో ఆగిపోతుందని విశ్వసిస్తుంది. గడిచిన 4ఏళ్లలో షేరు 400శాతానికి పైగా ర్యాలీ చేసింది. 4నెలల్లో 150శాతం ర్యాలీ చేసింది. ఇప్పుడు స్టాక్ ర్యాలీ కొంతకాలం పాటు ఆగిపోవచ్చని సీఎల్ఎస్ఏ తన నివేదికలో తెలిపింది. -
రిలయన్స్ షేరుపై బ్రోకరేజ్‌లకు ఎందుకంత మోజు..?
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది మార్చి కనిష్టస్థాయి నుంచి షేరు ఏకంగా 80శాతం పెరిగింది. కేవలం 3నెలల్లోనే 10 విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిలయన్స్ జియోలో దాదాపు రూ.1.04లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో మంగళవారం ఇంట్రాడే షేరు రూ.1647 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ షేరు ఇంత స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., రానున్న రోజుల్లో మరింత లాభపడేందుకు అవకాశాలున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మెన్ శాక్స్, సీఎల్‌ఎస్‌ఏలు రిలయన్స్ షేరుపై ఇప్పటికీ బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుపై ఆయా సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి... మోర్గాన్ స్టాన్లీ: ఆస్తుల అమ్మకాలు, ఇంధన విభాగంలో క్యాష్ ఫ్లోలు తిరిగి పుంజుకోవడం, రిటైల్ అమ్మకాలు పెరగడం, టెలికాం యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగడం తదితర కారణాలతో షేరు రానున్న రోజుల్లో మరింత ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. ‘‘ ఏడాది తర్వాత ప్రైస్-టు-ఎర్నింగ్ (పీ/ఈ), ప్రైస్-టు-బుక్ (పీ/బీ)లు ఇప్పుడు సైకిల్ లెవల్లో గరిష్టస్థాయి వద్ద ఉన్నాయి. అయితే ఈక్విటీపై రిటర్న్(ఆర్ఓఈ), వృద్ధి ఆదాయాలను తన సహచర కంపెనీలు(పీర్స్)తో పోలిస్తే అధికంగా ఉన్నాయి.’’ అని మోర్గాన్ స్టాన్లీ ఈక్విటి విశ్లేషకుడు మయాంక్ మహేశ్వర్ తెలిపారు. మోర్గాన్ స్లాన్టీ ఈ షేరుపై ఓవర్‌వెయిట్ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.1801కి పెంచింది. గోల్డ్‌మెన్ శాక్స్: బ్రోకరేజ్ అంచనాల ప్రకారం.... ఆఫ్‌లైన్ గ్రాసరీ స్టోర్ విస్తరణ-ఆధారిత మార్కెట్ వాటా, ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ విస్తరణతో రిలయన్స్ గ్రాసరీ రీటైల్ స్థూల వ్యాపారణ విలువ ఆర్థిక సంవత్సరం 2029 నాటికి 83బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అంతేకాకుండా, రిటైల్ వ్యాపారం ఎబిడిటా ఎఫ్వై 20-29 మధ్య 5.6 రెట్ల వృద్ధిని సాధిస్తుందని బ్రోకరేజ్ సంస్థ ఆశిస్తోంది. గోల్డ్‌మెన్ శాక్స్ ''బై'' రేటింగ్ కేటాయించడంతో పాటు పాటు షేరు టార్గెట్ ధరను రూ.1755గా నిర్ణయించింది సీఎల్ఎస్ఏ: ఈ-కామర్స్ రంగంలో విజయవంతం కావడం, ఇన్విట్ టవర్ల వాటా అమ్మకం, జియో ఫ్లాట్‌ఫామ్‌లో మరింత వాటా విక్రయం, అరామ్కో ఒప్పందం తదితదర అంశాలు రిలయన్స్ షేరు తదుపరి ర్యాలీని నడిపిస్తాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇటీవల ఫేస్‌బుక్‌తో ఒప్పందం జియో మార్ట్‌కు కలిసొస్తుంది. ఫేస్బుక్ అనుబంధ సంస్థ వాట్సప్ ద్వారా వినియోగదారులతో సత్సంబంధం పెంచుకోవడం, నిరంతరం వారికి అందుబాటులో ఉండటంతో వ్యాపార అభివృద్ధికి మరింత కలిసొస్తుందని సీఎల్ఎస్ఏ తెలిపింది. సీఎల్‌ఎస్‌ఈ బ్రోకరేజ్ సంస్థ సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. -
సీఎల్ఎస్ఏ టార్గెట్ ధరను పెంచిన 5 షేర్లు ఇవే..!
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న భారీ అమ్మకాలతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండు రోజులుగా భారీ నష్టాలను చవిచూస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరగడం, లాక్డౌన్ విధింపుతో ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు మరింత కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ 5 షేర్లకు టార్గెట్ ధరను పెంచింది. ఇప్పుడు వాటి పూర్తి వివరాలు చూద్దాం... డీఎల్ఎఫ్ఏ: గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొసాగించింది. టార్గెట్ ధరను రూ.180 నుంచి రూ.190కి పెంచింది. అమ్మకాల వ్యూహంలో మార్పు, మధ్య తరగతి నిర్మాణాలు అధికంగా చేపట్టడం నిర్మాణ సమయంలో అమ్మకాలను ప్రారంభించడటం తదితర ప్రణాళికలతో మొత్తం అమ్మకాల వాల్యూమ్ పునరుద్ధరణ జరగవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022)లో రూ.2,500 కోట్ల అమ్మకాలు జరగవచ్చు. అయితే ఎఫ్వై 21 అంచనాను రూ .1.600 కోట్లుగా కొనసాగించింది వేదాంత లిమిటెడ్: ఇంతకు ముందు కేటాయించిన అండర్ఫర్ఫామ్ రేటింగ్‌ను అవుట్‌ఫెర్‌ఫామ్ రేటింగ్‌కు అప్‌గ్రేడ్ చేసింది. షేరు టార్గెట్ ధరను రూ.95గా నిర్ణయించింది. గతంలో ఇదే షేరుకు టార్గెట్ ధరను రూ.80గా కేటాయించింది. కంపెనీ నిర్వహణ ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. లాక్డౌన్ బలహీనత నికరలాభం మీద ఒత్తిడిని పెంచుతుంది. అల్యూమినియం ఉత్పత్తి సానుకూలంగా ఉండటంతో క్యూ4 ఈబిఐటిడీఏ అంచనాలకు అనుగుణంగా ఉంది. తక్కువ వ్యాల్యూమ్స్, అధిక పరపతితో సంస్థ ఫండమెంటల్స్ ఇంకా బలహీనంగానే ఉన్నాయి. కంపెనీ మెరుగైన కార్యచరణ షేరును నడిపిస్తుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. హీరో మోటోకార్ప్: గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించింది. షేరు టార్గెట్ ధర రూ.2400 నుంచి రూ.2700కు పెంచింది. అంచనాలకు మించి క్యూ4 ఫలితాలను వెల్లడించింది. అయితే ఆదాయం/ఎబిఐటీడిటా 1శాతం, 20శాతంగా నమోదుకావడం కలిసొచ్చే అంశం. సమీప-కాల డిమాండ్ అనిశ్చితంగా ఉండొచ్చు. కాని ద్విచక్ర వాహన మార్కెట్లో కంపెనీ వాటా భారీగా ఉండటం సానుకూలాంశమని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్: షేరు టార్గెట్ ధరను రూ.197 నుంచి రూ.185 పెంచింది. ఫండమెంటల్స్ ఇంకా సహకరించకపోవడంతో స్టీల్ ఇటీవల జరిగిన ర్యాలీ జరగలేదు. ఇప్పుడు ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ యాక్టివిటీ స్టీల్ సంబంధిత కార్యక్రమాల వైపు ఎక్కువగా ఉంటుంది. టాటా స్టీల్: షేరు టార్గెట్ ధరను రూ.290 నుంచి రూ.304కు పెంచింది. స్టీల్ ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. అలాగే సాంకేతికంగా వీక్లీ, షార్ట్ టర్మ్ ఛార్ట్లు బుల్లిష్ వైఖరిని సూచిస్తున్నాయి. కాబట్టి స్వల్పకాలికానికి షేరు కొనుగోలు చేయడం ఉత్తమం అని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
కంపెనీ బోర్డుల్లో యువతకు చోటేది?
న్యూఢిల్లీ: యువ జనాభా అత్యధికంగా కలిగిన భారత్ భవిష్యత్తు ఆర్థిక దిగ్గజంగా తప్పకుండా అవతరిస్తుందని ఎంతో మంది విశ్వసిస్తున్నారు. దేశ ఉత్పాదకతను పెంచేందుకు యువతరం మన విలువైన సొత్తు. కానీ, యువతకు ఉద్యోగ కల్పన విషయంలో కీలకమైన కార్పొరేట్ కంపెనీల బోర్డుల్లో మాత్రం... యువ నిపుణులకు తగిన చోటు లేదన్న వాస్తవం ఒప్పుకుని తీరాల్సిందే. కంపెనీల ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్ట్స్’ మరింత స్వతంత్రంగా, అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి చేరుతున్నా... ఒక్కటి మాత్రం లోటు కనిపిస్తోంది. బోర్డుల్లో అనుభవజు్ఞలు అవసరమైనప్పటికీ, అదే సమయంలో యువతకు కనీస ప్రాతినిధ్యం లేకపోవడం ఆలోచించాల్సిన అంశమే. బీఎస్ఈ100 కంనీల్లో 38 కంపెనీల బోర్డుల స్వరూపాన్ని సీఎల్ఎస్ఏ పరిశీలించగా... డైరెక్టర్ల సగటు వయసు 2019 మార్చి చివరికి 63గా ఉందని తెలిసింది. 2009 నాటికి ఉన్న 59 ఏళ్ల సగటు నుంచి పెరిగినట్టు స్పష్టమవుతోంది. దీనికితోడు స్వతంత్ర డైరెక్టర్ల పదవీ కాలం కూడా మరింత కుంచించుకుపోతోంది. కార్పొరేట్ మోసాలతో బోర్డుల స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితుల్లో సీఎల్ఎస్ఏ అధ్యయనంలో ఈ ఫలితాలు వెలుగు చూడడం ఆలోచింపజేసేదే. ఈ నివేదికలోని వివరాలను పరిశీలిస్తే.. పరిమిత పాత్ర... బోర్డుల్లో డైరెక్టర్ల సగటు వయసు పెరగడానికి ప్రస్తుత సభ్యుల వయసు పెరుగుతుండడమే ఒక కారణం. వీరంతా దశాబ్ద కాలంగా ఆయా కంపెనీల బోర్డుల్లో తిష్ట వేసిన వారే. బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో 30 శాతం వరకు మారకుండా ఉండడం సాధరణమేనన్నది సీఎల్ఎస్ఏ నిర్వచనం. ఎందుకంటే సాధారణంగా ప్రమోటర్లు, వారి సంబం«దీకులే బోర్డుల్లో ఎక్కువ మంది ఉండడంతోపాటు వారు రిటైట్ అవడానికి అంతగా ఇష్టపడరు. ఏదో ఫలానా రంగం, ఫలానా కంపెనీ అనేమీ లేదు. అన్ని చోట్లా యువతకు సరైన ప్రాతినిధ్యం అయితే లేదు. ఎందుకంటే 2018–19 ఆరి్థక సంవత్సరం నాటికి కేవలం కంపెనీల బోర్డు డైరెక్టర్లలో 7 శాతం మందే 50 ఏళ్లలోపు వారున్నారు. 2009 ఆరి్థక సంవత్సరం నాటికి ఉన్న 18 శాతంతో పోలిస్తే యువ నిపుణులకు చోటు తగ్గుతూ వచి్చనట్టు స్పష్టమవుతోంది. అనుభవానికే.. అయితే, కంపెనీల బోర్డులు వయోభారంతో ఉండడం అన్నది కేవలం మన దేశంలో ఉన్న పరిణామమేమీ కాదు. నాస్డాక్ 100 కంపెనీలను పరిశీలించినా ఇదే తెలుస్తుంది. వీటి బోర్డుల్లో డైరెక్టర్ల సగటు వయసు 62గా ఉంది. అంటే మన కంపెనీలతో పోలిస్తే కేవలం ఏడాది తక్కువ. ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే నాస్డాక్100 అన్నది టెక్నాలజీ పరంగా అత్యాధునిక, దిగ్గజ కంపెనీలు. అంటే వీటితోపాటు, మన కార్పొరేట్ కంపెనీల్లోనూ అనుభవానికే పెద్ద పీట వేస్తున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా ధోరణితో ప్రమోటర్ల కుటుంబ సభ్యులు అయితే తప్పించి యువతకు బోర్డుల్లో చోటు కష్టంగా మారుతోందని సీఎల్ఎస్ఏ తన నివేదికలో వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. యువతరం అవసరమా..? ఎస్అండ్పీ 500, నికాయ్ 225 కంపెనీల్లోనూ ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. వీటిల్లో డైరెక్టర్ల సగటు వయసు 63 సంవత్సరాలు. టెక్నాలజీ పరంగా ఎంతో ముందడుగు ఉన్న నేడు, భారత కంపెనీల బోర్డులకు మరింత యువరక్తం అవసరమా లేక అనుభవమే ముఖ్యమా అన్న ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుందని సీఎల్ఎస్ఏ పేర్కొంది. కంపెనీ బోర్డులో కనీసం సగం మంది స్వతంత్ర డైరెక్టర్లు, కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉండాలని కంపెనీల చట్టం 2013 స్పష్టం చేస్తోంది. 2015 ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. దీంతో 2013–14 నాటికి బీఎస్ఈ 100 కంపెనీల్లో మహిళా డైరెక్టర్లు 7.9%గా ఉంటే, 2018–19 నాటికి ఇది 15.2%కి పెరిగింది. -
ఇన్ఫీకి నీలేకని జోష్..!
♦ ఆయన రాకతో శుభారంభం ♦ సీఎల్ఎస్ఏ వ్యాఖ్యలు ♦ సీఈవో ఎంపిక ప్రక్రియ జోరు... ♦ వ్యూహాల పునఃసమీక్ష సానుకూలాంశాలు న్యూఢిల్లీ: వివాదాల నుంచి బైటపడే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్‌గా రావడం కంపెనీకి ఊతమివ్వగలదని బ్రోకింగ్ కన్సల్టెన్సీ సంస్థ సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది. ఇది సంస్థకు శుభారంభం ఇవ్వగలదని పేర్కొంది. సుస్థిరమైన నాయకత్వం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించుకోవడం, కంపెనీ సంస్కృతిపరమైన వివాదాల పరిష్కారం మొదలైన అంశాల దిశగా ఇన్ఫీ తలపెట్టే చర్యలకు సంబంధించి గత ఆరేళ్లలో కంపెనీకి లభించిన అత్యుత్తమ శుభారంభం ఇదే కాగలదని సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది. వ్యవస్థాపకులు, బోర్డు మధ్య విభేదాల నేపథ్యంలో సీఈవో విశాల్ సిక్కా వైదొలగడం, పరిస్థితులు చక్కదిద్దేందుకు నందన్ నీలేకని పునరాగమనం తదితర పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్.. ఇప్పటికే సీఈవో ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారని, వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాలను పునఃసమీక్షించడం మొదలుపెట్టడం తదితర అంశాలు సానుకూల ధోరణిలో ఇన్వెస్టర్లను ఆశ్చర్యపర్చాయని సీఎల్ఎస్ఏ తెలిపింది. ‘ఇన్ఫీ వ్యూహాల దిశ మారనుండటం, మెరుగైన నాయకత్వం, తక్కువ వేల్యుయేషన్ తదితర అంశాల కారణంగా రిస్కులతో పోలిస్తే రివార్డులు గణనీయంగా మెరుగుపడగలవు’ అని పేర్కొంది. మరోవైపు, ఇన్ఫోసిస్‌కు దార్శనికత గల సీఈవో అవసరమని పరిశ్రమ నిపుణుడు గణేష్ నటరాజన్ తెలిపారు. సదరు సీఈవోకి టెక్నాలజీ నైపుణ్యం ఒక్కటే ఉంటే సరిపోదని.. ఇటు బోర్డును.. అటు ఒత్తిడి చేసే వర్గాలను సైతం మెప్పిస్తూ, కంపెనీని ముందుకు తీసుకెళ్లే సత్తా కూడా ఉండాలని ఆయన చెప్పారు. బైబ్యాక్‌లో ప్రమోటర్లు కూడా.. ఇన్ఫోసిస్ ప్రతిపాదిత బైబ్యాక్ ఆఫర్లో తమ షేర్లను కూడా విక్రయించాలని కంపెనీ ప్రమోటర్లు భావిస్తున్నారు. ఈ మేరకు కొందరు ప్రమోటర్లు తమ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే, ఆయా ప్రమోటర్ల పేర్లు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితర సహ వ్యవస్థాపకులకు ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో 12.75 శాతం వాటాలు ఉన్నాయి. వ్యవస్థాపకుల నుంచి వేధింపుల కారణంతో సీఈవో హోదా నుంచి సిక్కా వైదొలిగిన మరుసటి రోజే ఇన్ఫోసిస్ బోర్డు సుమారు రూ. 13,000 కోట్ల విలువ చేసే షేర్ల బైబ్యాక్ ఆఫర్‌కి ఆమోదముద్ర వేసింది. షేరు ఒక్కింటికి రూ. 1,150 చొప్పున మొత్తం రూ. 11.3 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ ప్రతిపాదనకు ప్రత్యేక తీర్మానం ద్వారా షేర్హోల్డర్లు ఇంకా ఆమోదం తెలపాల్సి ఉన్నట్లు కంపెనీ వివరించింది. -
ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ విలీనం మంచిదే!
♦ కేంద్రానికి లాభమని సీఎల్ఎస్ఏ అంచనా ♦ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం నెరవేరుతుంది న్యూఢిల్లీ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)లో మెజారిటీ వాటాను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తే ప్రధానంగా ప్రయోజనం పొందేది కేంద్ర ప్రభుత్వమేనని బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా వేసింది. దీని ద్వారా ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం సులభంగా నెరవేరనుందని సీఎల్ఎస్ఏ అభిప్రాయం. అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడే ఓ అతిపెద్ద ఇంధన సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల వెల్ల డించిన విషయం తెలిసిందే. ఇంధన ఉత్పత్తి నుంచి విక్రయం వరకూ సమగ్ర కార్యకలాపాలను నిర్వహించే ఒక కంపెనీ ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా జైట్లీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హెచ్పీసీఎల్లో వాటాను ప్రభుత్వరంగంలోని ఓఎన్జీసీ కొనుగోలు చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఓఎన్జీసీ ముందున్న అవకాశాలు హెచ్పీసీఎల్లో ప్రభుత్వానికి ఉన్న 51 శాతం వాటాను కొనుగోలు చేయాలంటే ఓఎన్జీసీకి సుమారు రూ.28,300 కోట్లు అవసరం అవుతాయి. ఓఎన్జీసీ వద్ద రూ.16,648 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. హెచ్పీసీఎల్లో వాటా కొనుగోలుకు గాను అదనంగా రుణాలు తీసుకోవడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఓఎన్జీసీకి ఈ ఏడాది మార్చి నాటికి రూ.55,682 కోట్ల రుణ భారం ఉంది. హెచ్పీసీఎల్లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు రుణాలు తీసుకుంటే మాత్రం మొత్తంమీద రుణభారం అధికమవుతుందని సీఎల్ఎస్ఏ తన నివేదికలో వివంరిచింది. హెచ్పీసీఎల్లో వాటా కొనుగోలుకు ఓఎన్జీసీ ముందున్న మరో ఆప్షన్... ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)లో తనకున్న 13.8 శాతం వాటాను అమ్మేయడమేనని సీఎల్ఎస్ఏ పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఐవోసీ వాటా విక్రయంతో... హెచ్పీసీఎల్లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు అవసరమైనన్ని నిధులు ఓఎన్జీసీకి సమకూరుతాయని తెలిపింది. వాటా విక్రయిస్తే గనుక ఐవోసీ షేరు ధర ప్రభావితం కావచ్చని అభిప్రాయపడింది. ఒకవేళ విలీనం సాకారమైతే ఐవోసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత దేశంలో మూడో అతిపెద్ద రిఫైనరీ సంస్థగా ఓఎన్జీసీ అవతరిస్తుంది. ఇది తొలి అడుగే ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ విలీనం తొలి అడుగేనని, ప్రభుత్వం ఇంధన రంగంలో ఉన్న క్రాస్ హోల్డింగ్స్(ప్రభుత్వరంగ సంస్థలు ఒకదానిలో ఒకటి వాటాలను కలిగి ఉండడం)ను నగదుగా మార్చుకోవచ్చని సీఎల్ఎస్ఏ అంచనా వేసింది. తదుపరి దశలో ఆయిల్ ఇండియాను విలీనం చేసుకోవాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం కోరవచ్చని పేర్కొంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టే హెచ్పీసీఎల్లో కేంద్రం వాటాను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తే ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం సులభంగా నెరవేరనుంది. అందుకే ఈ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వమే ప్రధానంగా లబ్ధి పొందనుందని సీఎల్ఎస్ఏ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.72,500 కోట్లను సమకూర్చుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ డీల్‌తో ప్రభుత్వ నిధుల సమీకరణ లక్ష్యంలో మూడోవంతు సమకూరినట్టేనని సీఎల్ఎస్ఏ వివరించింది.