న్యూఢిల్లీ: మార్కెట్ నుంచి అదనంగా రూ.50వేల కోట్ల మేర రుణ సమీకరణ చేయాలని ముందుగా భావించినప్పటికీ.. ప్రస్తుతం దాన్ని రూ. 20,000 కోట్లకు పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటిదాకా వచ్చిన ఆదాయాలు, వ్యయాలను సమీక్షించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల జారీ ద్వారా ప్రస్తుత అవసరాల కోసం రూ.20,000 కోట్లు సమీకరిస్తే సరిపోతుందని సమీక్షలో తేలినట్లు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఒక ప్రకటన చేసింది.
మూడు సార్లు నిర్వహించిన సెక్యూరిటీస్ వేలంలో... రూ.15,000 కోట్ల మేర రుణాలను స్వీకరించలేదని పేర్కొంది. రాబోయే వారాల్లో మరో రూ.15,000 కోట్ల మొత్తాన్ని కూడా రుణ సమీకరణ నోటిఫికేషన్ నుంచి తగ్గించనున్నట్లు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును జీడీపీలో 3.2%కి పరిమితం చేయాలనేది కేంద్రం లక్ష్యం. అయితే, గతేడాది నవంబర్ నాటికే బడ్జెట్‌లో నిర్దేశించుకున్న ద్రవ్య లోటు లక్ష్యం 112% మేర దాటిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment