గతేడాది కంటే ఇప్పుడు బెటర్
రిజర్వుబ్యాంక్ వార్షిక నివేదిక
• 2016-17లో 7.6% వృద్ధి అంచనా
• 2015-16లో ఈ రేటు 7.2 శాతం
• ద్రవ్యోల్బణమూ కట్టడిలోనే ఉంటుందనని భరోసా...
• ద్రవ్యోల్బణం తగ్గుదలే రేటు కోతకు మార్గమని గవర్నర్ రాజన్ స్పష్టీకరణ
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంకంటే మెరుగ్గా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. 2015-16లో ఈ రేటు 7.2 శాతంకాగా, 2016-17లో ఈ రేటు 7.6 శాతానికి చేరుతుందన్నది తమ అంచనాగా వివరించింది. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణమూ లక్ష్యాల మేరకు కట్టడిలో ఉంటుందని వివరించింది. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి ద్రవ్యోల్బణం రేటు 6 శాతం కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ రేటు 5 శాతానికి దిగివస్తుందని వివరించింది.
తక్కువ స్థాయి క్రూడ్ ధరలు కొనసాగే అవకాశాలు, తగిన వర్షపాతం అంచనాలను దీనికి కారణంగా చూపింది. ఈ మేరకు 2015-16కు సంబంధించి తన వార్షిక నివేదికను ఆర్‌బీఐ సోమవారం విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ జీ రాజన్ నివేదికకు ముందు మాట రాశారు. ద్రవ్యోల్బణం దిగివస్తేనే కీలక రేటు (రెపో- బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో- ప్రస్తుతం 6.5 శాతం) కోతకు అవకాశం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
⇔ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడివడిన ప్రభావం కొంత ఆర్థిక వ్యవస్థపై కనబడుతుంది. ఈక్విటీ, విదేశీ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌పై తక్షణం ఈ ప్రభావం కనబడింది. బ్రిటన్, యూరో ప్రాంతంతో తగిన వాణిజ్య సంబంధాలు ఉండడం వల్ల వాణిజ్య, ఆర్థిక అంశాల్లో బ్రెగ్జిట్ ప్రభావం కనిపిస్తుంది. ఇలాంటి కొన్ని అవరోధాలు ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో దేశీయ ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే కనిపిస్తున్నాయి.
⇔ రక్షణ, పౌర విమానయానం, ఫార్మా, బ్రాడ్‌కాస్టింగ్ రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి వంటి ప్రభుత్వ చర్యలు పారిశ్రామిక వృద్ధికి దోహదపడతాయి.
⇔ రిటైల్ ద్రవ్యోల్బణం సూచీపై హౌస్ రెంట్ అలవెన్స్ పెరుగుదల ప్రతికూల ప్రభావం ఉంది.
⇔ 2016-17లో ప్రభుత్వ ద్రవ్యలోటు 3 శాతం వద్ద కట్టడి స్థూల ఆర్థిక రంగానికి కీలకం.
⇔ ఇటీవల ఎఫ్‌డీఐ విధాన సరళీకరణ వల్ల దేశానికి పెట్టుబడుల పరిస్థితి బాగున్నప్పటికీ, ఈ ఏడాది సెప్టెంబర్-నవంబర్ మధ్య స్పెషల్ స్వాప్ స్కీమ్ కింద జరుగనున్న ఎఫ్‌సీఎన్‌ఆర్ (బీ) రీపేమెంట్ నిర్వహణలో జాగరూకత పాటించాల్సిన అవసరం ఉంది.
⇔ ఆర్‌బీఐ నుంచి లభించిన రేటు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్‌కు బదలాయించడం లేదు. ఇది ఆందోళనకరమైన అంశం. 2015 జనవరి 15 నుంచి 2016 ఏప్రిల్ 5 మధ్య రెపో రేటు 150 బేసిస్ పాయింట్లు తగ్గింది. అయితే పలు బ్యాంకులు 60-92 బేసిస్ పాయింట్ల శ్రేణిలోనే వడ్డీరేట్లు తగ్గించాయి. రేటు తగ్గింపు ప్రయోజన బదలాయింపు చర్యలు అవసరం.
బ్యాలెన్స్ షీట్ రూ.32.43 లక్షల కోట్లు..
2015-16లో ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ 12% పెరిగి రూ.32.43 లక్షల కోట్లకు చేరినట్లు వార్షిక నివేదిక వెల్లడించింది. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్స్ 8% పెరగ్గా, దేశీయంగా ఈ పెరుగుదల రేటు 35.64%. 2015-16లో రూ. 65,876 మిగులును కేంద్రానికి బదలాయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ప్రధానంగా అమెరికా ట్రెజరీ బిల్స్‌సహా ఇతర సావరిన్ బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్ కార్యకలాపాల వల్ల ఆర్‌బీఐకి ఈ మిగులు సమకూరింది. 2014-15లో కేంద్రానికి ఆర్‌బీఐ ఇచ్చిన మిగులు రూ.65,896 కోట్లు.
సామర్థ ్యం కంటే తక్కువ వృద్ధి: రాజన్
దేశంలో వృద్ధి తీరు మెరుగుపడుతోందని రాజన్ పేర్కొన్నారు. అయితే సామర్థ్యానికంటే ఇది తక్కువేనని అన్నారు. రేట్ల తగ్గింపునకు బ్యాంకులు ముందుకురావడం లేదనీ పేర్కొన్నారు. నివేదికలో రాజన్ రాసిన ముందుమాటలో కొన్ని ముఖ్యాంశాలు...
ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్‌బీఐ లక్ష్యాలకన్నా అధిక స్థాయిలోనే కొనసాగుతోంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం రెండు సంవత్సరాల గరిష్ట స్థాయి 6.07 శాతంకాగా, టోకు ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్ట స్థాయి 3.55 శాతం. వాస్తవ సానుకూల వడ్డీరేటును మదుపుదారులు కోరుకుంటున్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారులు, రిటైల్ రుణ గ్రహీతలు తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థను కాంక్షిస్తున్నారు. అయితే ఇదంతా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటేనే సాధ్యమవుతుంది. దీనిని 4 శాతం వద్ద కట్టడిచేయడమే ఆర్‌బీఐ స్వల్పకాలిక స్థూల ఆర్థిక లక్ష్యం. ఇక మౌలిక రంగం అభివృద్ధీ కీలకమే.
ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తికావడానికి ప్రభుత్వం, బ్యాంకులతో ఆర్‌బీఐ కలిసి పనిచేస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచడంపైనా దృష్టి సారిస్తోంది. బ్యాంకులు ఎన్‌పీఏలకు తగిన ప్రొవిజినింగ్ కేటాయింపులు, వాటికి ఎటువంటి మూలధనా కొరతా రాకుండా చర్యలు, కొత్త రుణాల మంజూరు అదే సమయంలో తక్కువ వడ్డీరేటు రుణ వ్యవస్థ వంటి అన్ని అంశాలపై ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుంది. ఇది పెట్టుబడులు, పారిశ్రామిక క్రియాశీలతకు దోహదపడడానికి దారితీస్తుంది. ఇక వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలూ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది. కాగా రెపో నిర్ణయానికి సంబంధించి ద్రవ్య విధాన కమిటీ ఏర్పాటు హర్షణీయం.