జీడీపీ వృద్ధి.. అంత గొప్పగా ఏమీ లేదు!!
బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 7.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మిగతా సంపన్న దేశాల కన్నా అధికంగానే కనిపిస్తున్నప్పటికీ.. అంత ప్రోత్సాహకరంగా ఏమీ లేదని వ్యాపార దిగ్గజం బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. గత 4–5 ఏళ్లుగా చెప్పుకోతగ్గ పెట్టుబడులేమీ రాకపోవడం, బ్యాంకుల్లో మొండి బకాయిల భారంతో కొత్త రుణాలు పుట్టక ప్రైవేట్ రంగం కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతుండటం.. వీటన్నింటికీ పెద్ద నోట్ల రద్దు కూడా తోడవడం మొదలైనవి వృద్ధి మందగించడానికి కారణాలని ఆయన పేర్కొన్నారు.
‘2016–17లో ప్రోత్సాహకరమైన దేశ ఆర్థిక వృద్ధి గణాంకాలతో నా ప్రసంగం మొదలుపెట్టాలనుకున్నాను. కానీ వృద్ధి నేను అనుకున్నంత ప్రోత్సాహకరంగా ఏమీ లేదని తాజా గణాంకాలన్నీ నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాక తెలిసింది’ అని 2016–17 వార్షిక నివేదికలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘కేంద్రీయ గణాంకాల సంస్థ తాజా లెక్కల ప్రకారం 2016–17లో 7.1 శాతంగా నమోదైన వృద్ధి నిస్సందేహంగా సంపన్న దేశాలు, చైనా వంటి వర్ధమాన దేశాల కన్నా కూడా ఎక్కువే. కాదనను. కానీ అంతకు ముందు ఆర్థిక సంవత్సరం సాధించిన 7.9 శాతం కన్నా ఇది తక్కువే‘ అని పేర్కొన్నారు. స్థిరంగా 7.5–8 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించడానికి ఇంకా చాలా కాలం పట్టేస్తుందని బజాజ్ తెలిపారు.