
కొన్ని రకాల స్టిల్ ఉత్పత్తులపై యాంటి డంపింగ్ డ్యూటీ గడువును ప్రభుత్వం పొడిగించింది. చైనా, మలేషియా, కొరియా దేశాల నుంచి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై విధించే యాంటి డంపింగ్ డ్యూటీ గడువును డిసెంబర్ 4వరకు పొడిగిస్తున్నట్లు ఈ మేరకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. చైనా, మలేషియా, కొరియా దేశాల నుంచి అతితక్కువ ధరకు ఇండియాలో దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులను నియంత్రించేందుకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐదేళ్ల కాలపరిమితితో 2015 జూన్ 5న యాంటీ డంపింగ్ డ్యూటినీ దేశీయంగా అమల్లోకి తెచ్చింది.ఈ జూన్ 5(రేపటి)తో ఈ గడువు ముగియనుండడంతో ఈ ఏడాది డిసెంబర్ 4 వరకు దీనిని పొడిగించింది. ముఖ్యంగా స్టెయిన్‌లెస్ స్టీల్ 304 సిరీస్‌కు ఈ డ్యూటీ వర్తిస్తుంది. ఒక్కో టన్నుకు 180-316 డాలర్ల మధ్య యాంటి డంపింగ్ డ్యూటీ విధిస్తారు. వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్(డీజీటీఆర్) మలేషియా, చైనా, కొరియ దేశాలపై యాంటీ డంపింగ్ గడువును మరో 6 నెలలపాటు పెంచమని కోరడంతో..ఆర్థిక మంత్రిత్వశాఖ దీనిని ఆమోదించి గడువును పొడిగించింది. ఇతర దేశాల నుంచి అతి తక్కువ ధరల్లో ఉత్పత్తులు మన దేశంలోకి దిగుమతి అవ్వడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. దీంతో ప్రపంచ వాణిజ్య సంస్థ( డబ్ల్యూటీఓ) నిబంధనలకనుగుణంగా దిగుమతులను కొంతమేర నియంత్రించేందుకు యాంటీ డంపింగ్ డ్యూటీని అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment