కార్ల కాలుష్యంపై ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్ నోటీసులు
న్యూఢిల్లీ: ఆడిఏ6 , ఆక్టావియా తదితర డీజిల్ కార్ల నుంచి ప్రామాణిక స్థాయికి మించి కాలుష్యకారక వాయువులు వెలువడుతున్నాయని పరీక్షల్లో తేలడంతో జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ వివరణతో పాటు సాంకేతిక అంశాలు మొదలైనవి కూడా ఇవ్వాలని సూచిం చినట్లు భారీ పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి అంబుజ్ శర్మ తెలిపారు. ల్యాబొరేటరీల్లో పరీక్షలతో పోలిస్తే బైట రహదారిపై ఆడిఏ6, జెటా, ఆక్టావియా, ఆడిఏ4 డీజిల్ కార్లు అధికంగా కాలుష్య వాయువులు విడుదల చేస్తున్నాయని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్(ఏఆర్‌ఏఐ) గుర్తిం చినట్లు చెప్పారు.
ఏఆర్‌ఏఎ నోటీసులు అందాయని, నవంబర్ 30లోగా వివరణ ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కాలుష్య ప్రమాణ పరీక్షల నుంచి మోసపూరితంగా గట్టెక్కించే సాఫ్ట్‌వేర్.. ఫోక్స్‌వ్యాగన్ కార్లలో ఉందని తేలడం, దీంతో ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున వాహనాలను సంస్థ రీకాల్ చేయడం తెలి సిందే. కంపెనీపై అమెరికా దాదాపు 18 బిలియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.