సెలవుల్లో కూడా పన్ను చెల్లించొచ్చు
ముంబై: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా పన్ను చెల్లింపుదారుల కోసం ఎంపికచేసిన శాఖలను ఈ నెలాఖరులో మూడురోజులూ తెరిచివుంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బుధవారం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29 (శనివారం), 31(సోమవారం-ప్రభుత్వం ఉగాది సెలవు ప్రకటించని బ్యాంక్ బ్రాంచీల్లో) ఆయా శాఖల్ని రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంచాలని పేర్కొంది. ఈ నెల 30(ఆదివారం), 31 (సోమవారం) ప్రభుత్వ సెలవు ప్రకటించిన బ్రాంచీల్లో కూడా ఆ రోజుల్లో సాధారణ పని గంటల వరకూ బ్యాంకులను తెరచి ఉంచాలని ఆదేశించింది.
భారత ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఆర్థిక సంవత్సరం ముగింపును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ వివరించింది. అంతే కాకుండా ఈ నెల 29, 30, 31 తేదీల్లో అన్ని క్లియరింగ్ హౌజుల్లో ప్రత్యేకమైన క్లియరింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించామని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ అకౌంట్ లావాదేవీల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.