
ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సన్నాహాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో పౌర విమానయానమంత్రి హర్దీప్ పూరి ఈ విషయం వెల్లడించారు. దేశంలోని ఆరు ఎయిర్‌పోర్టుల నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్ధలను ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూర్, తిరువనంతపురం, గువహటి విమానాశ్రయాల ప్రైవేటీకరణ చేపడతామని తెలిపారు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)తో పాటు విమాన ప్రయాణీకులకూ ఇది ఉపకరిస్తుందని అన్నారు. ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలను కేంద్ర మంత్రి ఉదాహరణగా చూపారు. దేశవ్యాప్తంగా లాభాల బాటలో నడుస్తున్న ఆరు విమానాశ్రయాలను ప్రైవేటకరించాలన్న ప్రతిపాదనను ఏఏఐ ఉద్యోగుల సమాఖ్య వ్యతిరేకిస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.