67 కోట్లకు జీఎస్‌ఎం వినియోగదారులు
సీఓఏఐ వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో 82.1 లక్షల మంది కొత్తగా జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులయ్యారు. దీంతో అక్టోబర్ చివరి నాటికి 66.21 కోట్లుగా ఉన్న జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య నవంబర్ చివరినాటికి 1.2 శాతం వృద్ధితో 67.02 కోట్లకు పెరిగిందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) పేర్కొంది. లూప్, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థల గణాంకాలను మినహాయించామని పేర్కొంది.
లెసైన్స్ గడువు పూర్తికావడంతో లూప్ మొబైల్ సంస్థ కార్యకలాపాలు నిలిపేసిందని, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ 2012 సెప్టెంబర్ నుంచి వివరాలను అందజేయడం లేదని వివరించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, క్వాడ్రంట్ కంపెనీల గణాంకాలు ఈ సమాచారంలో లేవని పేర్కొంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా తమ సంఘంలో చేరిందని, అయితే ఈ సంస్థ ఇంకా కార్యకలాపాలు ప్రారంభించిలేదని వివరించింది.