ముంబై : ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో మార్కెట్‌లో డిమాండ్ పుంజుకునేందుకు పలు వస్తువులు, సేవల ధరలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గోవాలో శుక్రవారం జరగనున్న 37వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ దిశగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థలో తిరిగి ఉత్తేజం నెలకొనడంతో పాటు కార్లు, బైక్‌లు సహా ఆటోమొబైల్ విక్రయాలు ఊపందుకునేలా పలు చర్యలు చేపడతారని భావిస్తున్నారు. బిస్కట్ల నుంచి కార్ల వరకూ పలు వస్తువులపై పన్ను తగ్గింపు నిర్ణయాలు వెల్లడవుతాయని ఆయా వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ సమావేశంలో పన్ను రేట్లు, విధానాల సరళీకరణకు సంబంధించి దాదాపు 80 ప్రతిపాదనలు ముందుకు రానున్నాయని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో సంక్షోభంలో కూరుకుపోయిన ఆటోమొబైల్ పరిశ్రమను ఆదుకునేందుకు కార్లపై ప్రస్తుతం విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తారని భావిస్తున్నారు. పండుగ సీజన్‌కు ముందు ఈ నిర్ణయం వెలువడితే విక్రయాలు పుంజుకుంటాయని ఆశిస్తున్నారు. ఈ దిశగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం కోసం ఆటోమొబైల్ కంపెనీలు వేచిచూస్తున్నాయి. బిస్కెట్లు, అగ్గిపుల్లలు, హోటల్స్‌కు సంబంధించి కూడా పన్ను రేట్ల తగ్గింపుపై ఆయా వర్గాలు సానుకూల నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నాయి. చిన్న వ్యాపారులకు కనీసం తొలి ఏడాది (2017-18) వరకైనా వార్షిక రిటన్ దాఖలు నుంచి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించనుంది. పిల్లలు, పెద్దలు నిత్యం ఉపయోగించే బిస్కట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని బిస్కెట్ తయారీదారులు కోరుతున్నారు. మరోవైపు లగ్జరీ హోటళ్లపై విధిస్తున్న జీఎస్టీ రేట్‌ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలనే డిమాండ్ జీఎస్టీ కౌన్సిల్ ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment