సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జీఎస్టీ కౌన్సిల్ ఈనెల 21న భేటీ కానుంది. ఈ సమావేశంలో అధిక శ్లాబ్‌లో ఉన్న పలు వస్తువులు, సేవలను తక్కువ పన్ను శ్లాబుల్లోకి తీసుకురావడంపై చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ సమర్పించే రెండు వారాల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం 28 శాతం శ్లాబ్‌లో ఉన్న పలు వస్తువులపై పన్ను శ్లాబును తగ్గించాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆటో, ఉత్పాదక, నిర్మాణ రంగాల్లో స్ధబ్ధత నెలకొన్న కారణంగా ఆయా రంగాల్లో ఉత్తేజం పెంచేందుకు జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించాలని పారిశ్రామిక వర్గాల నుంచి సైతం ఒత్తిడి ఎదురవుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇక బడా కంపెనీల పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు రూ 50 కోట్లు పైబడిన లావాదేవీలకు విధిగా ఈ-ఇన్వాయిసింగ్‌ను అనివార్యం చేయడంపైనా ఈ భేటీలో చర్చిస్తారు. కాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు గత ఏడాది డిసెంబర్ 22న మూవీ టికెట్లు, టీవీ, మానిటర్ స్ర్కీన్‌లు, పవర్ బ్యాంక్స్, నిల్వచేసే కూరగయాలు సహా 23 వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment