హోండా వెహికిల్స్ రేట్లు దిగొస్తున్నాయ్!
హోండా వెహికిల్స్ రేట్లు దిగొస్తున్నాయ్!
Published Sat, Jun 24 2017 8:20 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
ముంబై : దేశమంతటిన్నీ ఒకే పన్ను వ్యవస్థలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు కాబోతున్న తరుణంలో ప్రముఖ వాహన దిగ్గజం తన టూ-వీలర్ రేట్లను తగ్గించబోతుంది. టూ-వీలర్ వాహనాల ధరలన్నింటిపై 3 శాతం నుంచి 5 శాతం ధరలు తగ్గించాలని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నిర్ణయించింది. కొత్త పన్నుల ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ధరల తగ్గింపును తీసుకొస్తోంది. బజాజ్ ఆటో, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి టూ-వీలర్ దిగ్గజాలు ఇప్పటికే తగ్గింపు ధరలను ప్రకటించాయి. ఇదే ప్రక్రియను ఇతర వాహన సంస్థలు కూడా ఫాలో అవుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు వీటి జాబితాలోకి హోండా వచ్చి చేరింది. ఇంకా చాలా కంపెనీలు కొత్త పన్ను విధానం ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తూ ఉన్నాయి.
''హోండా టూ-వీలర్ రేట్ల తగ్గింపు రాష్ట్రం రాష్ట్రానికి, ప్రొడక్ట్, ప్రొడక్ట్ కి భిన్నంగా ఉంటుంది. 3 శాతం నుంచి 5 శాతం మధ్యలో రేట్లను తగ్గించాలని అనుకుంటున్నాం. జీఎస్టీ అమలుతో వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తాం'' అని హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ గులేరియా చెప్పారు. బజాజ్ ఆటో ఇప్పటికే వివిధ వాహనాలపై రూ.4500 వరకూ ధరలను తగ్గించింది. ఇక రాయల్‌ఎన్‌ఫీల్డ్ సైతం జూన్ 17, 2017 నుంచి జీఎస్‌టీకి అనుగుణంగా ధరలను తగ్గించినట్లు తెలిపింది. జీఎస్టీ నిబంధనల ప్రకారం 350సీసీ దాటిన వాహనాలపై అదనంగా 3శాతం సెస్ విధించే అవకాశం ఉంది. 28 శాతం పన్ను కిందకు వీటిని తీసుకురానున్నారు.. ముఖ్యంగా ప్రీమియం బైక్‌ల విషయంలోనే ధరల పెరుగుతుండగా, మిగిలిన వాహనాల ధరలు తగ్గనున్నాయి.
Advertisement
Advertisement