మరో మూడు నెలల్లో లక్ష ఉద్యోగాలు
హైదరాబాద్: వస్తువుల, సేవల పన్ను (జిఎస్టి) అమలుకారణంగా భారీగా ఉద్యోగాలు లభించనున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బందరు దత్తాత్రేయ చెప్పారు. జీఎస్‌టీ వల్ల కేవలం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే లాభం చేకూరదని భారీగా ఉద్యోగాలను సృష్టించనుందని ఆయన చెప్పారు. తదుపరి మూడు నెలల్లో లక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని శనివారం మీడియాకు తెలిపారు.
ప్రధానంగా అకౌంటెన్సీ రంగంలో దాదాపు 60వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయనే అంచనాలున్నాయని మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ప్రకటించారు. జీఎస్టీ అమలే ఒక చారిత్రక అధ్యాయమని పేర్కొన్నారు. జీఎస్‌టీ కారణంగా బోర్డర్ చెక్ పోస్టులను రద్దు చేయడంతో, వస్తువుల అంతర్ రాష్ట్ర రవాణా ఆలస్యం కాదని పేర్కొన్నారు. జీడీపీ 7 నుంచి 9 శాతానికి పెరగనుందనీ, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని చెప్పారు. జీఎస్టీ కొత్త పన్నుల విధానం అమలు నేపథ్యంలో వివిధ సంస్థలతో అనుబంధంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన జీఎస్‌టీ వర్క్‌షాపు నిర్వహించినట్టు చెప్పారు. గత ఆరు నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలకు 1,118 వర్క్ షాప్లను నిర్వహించామన్నారు.
ఈ సందర‍్భంగా శుక్రవారం రాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో జిఎస్‌టీ ప్రయోగ కార్యక్రమానికి హాజరు కాని కాంగ్రెస్, వామపక్ష పార్టీలపై దత్తాత్రేయ మండిపడ్డారు.