
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి చింతపండును మినహాయించి రైతులకు ఉపశమనం కలిగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. ఈ మేరకు ఢిల్లీలో గురువారం జైట్లీని ఆయన కలసి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో రైతులు చింతపండుపై జీఎస్టీ భారం మోపడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. మత్స్యకారులు వినియోగించే బోట్లు, వలలపై జీఎస్టీ భారాన్ని సడలించాలని కోరారు. తెలంగాణకు మంజూరు చేసిన ఎయిమ్స్‌కు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తులపై జైట్లీ సానుకూలంగా స్పందించినట్లు దత్తాత్రేయ మీడియాకు తెలిపారు.