
పన్ను అక్రమాలకు కళ్లెం
జీఎస్టీ చరిత్రాత్మక నిర్ణయం: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏకీకృత పన్ను వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం జీఎస్‌టీ తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇప్పటివరకున్న పన్ను వసూళ్ల ప్రక్రియ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేదని,ఇందులో దాదాపు 60శాతం పన్నులు దారి తప్పాయని అన్నారు. వీటిని గాడిలో పెట్టడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ చరిత్రాత్మక జీఎస్‌టీకి శ్రీకారం చుట్టారని, ఇది మోదీ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
జీఎస్టీ అమలుపై శనివారం ఇక్కడ ఈఎస్‌ఐసీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అస్తవ్యస్తమైన పన్నుల విధా నాన్ని మోదీ ప్రభుత్వం సంస్కరించిందన్నారు. 17 రకాల పన్నుల స్థానంలో జీఎస్టీని తీసుకొచ్చామని, చెక్‌పోస్టులుండవని, సరుకు రవాణా వేగవంతమ వుతుందని చెప్పారు. జీడీపీ వృద్ధి 7 నుంచి 9 శాతానికి పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారని గుర్తు చేశారు.
వచ్చే మూడు నెలల్లో దేశవ్యాప్తంగా లక్ష మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జీఎస్టీతో అటు తయారీదారుడు, ఇటు వినియోగదా రుడు లాభపడతారన్నారు. ఇప్పటి వరకు పన్ను వసూళ్లలో 1500 శ్లాబులుండేవని, తాజాగా వీటిని నాలుగు శ్లాబుల్లోకి మార్చినట్లు తెలిపారు. రూ.20 లక్షల లోపు లావాదేవీలు జరిపే వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి రారన్నారు. జీఎస్టీ శాఖలోని అధికారులకు ప్రత్యేకంగా ఫోన్ నంబర్లు కేటాయించామని, +917901243239 నుంచి +917901245421 వరకు ఉన్న నంబర్లలో సంప్ర దించవచ్చని మంత్రి తెలిపారు. జీఎస్టీ ప్రారంభ వేడుకలకు కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు గైర్హాజ రవడం సరికాదన్నారు. మోదీ ప్రతిష్ట పెరుగుతుం దనే దురుద్దేశంతో ఆ పార్టీలు జీఎస్టీని వ్యతిరే కిస్తున్నాయని ఆరోపించారు.