వేలంలోనే బొగ్గు కొనుక్కోండి..
జీవీకే ‘పంజాబ్’ ప్లాంటుకు కేంద్రం సూచన
హైదరాబాద్: పంజాబ్‌లోని గోయింద్వాల్ సాహిబ్ విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును ప్రత్యేక ఈ-వేలం ద్వారా కొనుగోలు చేసుకోవాలని జీవీకే పవర్‌కు అంతర్‌మంత్రిత్వ శాఖల బృందం సూచించింది. బొగ్గు సరఫరాకు సంబంధించిన అవగాహన ఒప్పందం గడువు ఈ ఏడాది జూన్ 30 నాటికే పూర్తయ్యిందని, దీన్ని పొడిగించబోవడం లేదని స్టాండింగ్ లింకేజ్ కమిటీ స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గోయింద్వాల్ సాహిబ్ వద్ద ఏర్పాటైన 540 మె.వా. థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనిట్ 1 ఈ ఏడాది ఏప్రిల్ 6న, యూనిట్ 2 ఏప్రిల్ 16న అందుబాటులోకి వచ్చాయి. అయితే, యూనిట్ 1లో బొగ్గు లభ్యత లేకపోవడం వల్ల ఏప్రిల్ 22 నుంచి ఉత్పత్తి నిల్చిపోయింది. ప్లాంటు నిరుపయోగంగా పడి ఉన్నందున బొగ్గు సరఫరా కల్పించాలంటూ జీవీకే కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.