సగం వ్యాపార సంస్థలుజీఎస్‌టీలోకి రావాల్సిందే
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న 6 కోట్ల ప్రైవేటు వ్యాపారాల్లో కనీసం 3 కోట్లనైనా జీఎస్‌టీ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పన్ను అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతానికి జీఎస్‌టీ నెట్‌వర్క్‌లో భాగమైన వ్యాపార సంస్థలు కోటిలోపే ఉన్నాయని, మూడు కోట్లకు చేర్చడం సాధ్యమేనని ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. అలాగే, ఐటీ వ్యవస్థను కూడా సమస్యల్లేకుండా నిర్వహించాలని కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలే జరిగిన పన్ను అధికారుల రెండు రోజుల వార్షిక సమావేశంలో ప్రభుత్వం తాజా లక్ష్యాన్ని వారి ముందుంచింది.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యక్ష పన్ను వసూళ్ల మండలి (సీబీడీటీ), సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) మధ్య సమచార మార్పిడికి శాశ్వత యంత్రాంగం ఏర్పాటు కీలకమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఆదాయపన్ను రిటర్నుల సమాచారం ఆధారంగా మరింత మందిని నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని వివరించాయి. అయితే, ముందు జీఎస్‌టీ విధానాన్ని పూర్తిగా సర్దుబాటు చేసిన తర్వాత ఈ యంత్రాంగం తెచ్చే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికి 72 లక్షల ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ చెల్లింపుదారులు జీఎస్‌టీలోకి వచ్చి చేరాయి.