రుణ రేటు తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బుధవారం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్‌ఆర్) ఆధారిత రుణ రేటును స్వల్పంగా 0.05% తగ్గించింది. కొత్త రుణ గ్రహీతల నెలవారీ వాయిదాల చెల్లింపు (ఈఎంఐ)లు తగ్గడానికి దోహదపడే అంశం ఇది. తాజా నిర్ణయంతో బ్యాంక్ రెండేళ్ల రుణ రేటు 9.25% నుంచి 9.20%కి తగ్గింది.
ఈ నిర్ణయం 7వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. నెలవారీ రేటు 9 శాతం నుంచి 8.95కు తగ్గింది. కొత్త రుణ గ్రహీతలకు బేస్ రేటు స్థానంలో ఎంసీఎల్‌ఆర్ వర్తిస్తుంది. బ్యాంకు రుణ సమీకరణ వ్యయం, నెట్‌వర్త్‌పై రిటర్న్స్ ప్రాతిపదికన ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణ రేటు నిర్ణయం జరుగుతుంది.
బీఓబీ పెంపు...: కాగా జూన్ 7 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా వార్షిక ఎంసీఎల్‌ఆర్‌ను ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 9.30 శాతం నుంచి 9.40 శాతానికి ఎగసింది.