
ముంబైలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శాఖలో రోబో ‘ఐరా’ సేవలను పరీక్షిస్తున్న ఒక కస్టమర్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. రెండేళ్లలో వివిధ బ్రాంచ్‌ల్లో 20 వరకూ హ్యుమనాయిడ్(రోబో)లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. రెండేళ్లలో వివిధ బ్రాంచ్‌ల్లో 20 వరకూ హ్యుమనాయిడ్(రోబో)లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బ్యాంక్ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు 18–24 నెలల్లో 15–20 హ్యుమనాయిడ్స్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నామని బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ చెప్పారు. ఇక్కడి ఒక బ్రాంచ్‌లో ఐరా పేరుతో ఏర్పాటు చేసిన హ్యుమనాయిడ్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. వెల్‌కమ్ డెస్క్ దగ్గర ఖాతాదారులకు ఐరా సూచనలందిస్తుందని వివరించారు.
లావాదేవీలతో సహా ఇతర పనులను కూడా వీటితో చేయించే అవకాశాలున్నాయని తెలిపారు. ఖాతాదారుల అవసరాలను గుర్తించి వాటిని సమర్థవంతంగా అందించే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీలపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. కాగా బ్రాంచ్‌లో రోబోలను వినియోగించిన తొలి భారత బ్యాంక్‌గా సిటీ యూనియన్ బ్యాంక్ నిలిచింది. గత ఏడాది తొలి రోబోను ఈ బ్యాంక్ ఏర్పాటు చేసింది. కేరళకు చెందిన ఆసిమోవ్ రోబొటిక్స్ సంస్థ ఐరాను రూపొందించింది.