
హెల్త్‌కేర్, ఐటీ హవా
స్వల్ప లాభాలతో సరి
రెండు రోజుల నష్టాలకు చెక్
హెల్త్‌కేర్, ఐటీ రంగాలు 2.5% చొప్పున పుంజుకోవడంతో మార్కెట్లు లాభపడ్డాయి. రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ చెబుతూ సెన్సెక్స్ 37 పాయింట్లు పెరిగి 25,100 వద్ద ముగిసింది. తొలుత గరిష్టంగా 25,210కు చేరినప్పటికీ, ఒక దశలో అమ్మకాలు పెరిగి కనిష్టంగా 25,033ను సైతం చవిచూసింది. చివరికి స్వల్ప లాభాలను కూడగట్టుకుంది. ఇక నిఫ్టీ కూడా లాభనష్టాల మధ్య ఊగిసలాడి, చివరికి 16 పాయింట్లు అధికంగా 7,509 వద్ద స్థిరపడింది. ప్రధానంగా హెల్త్‌కేర్ దిగ్గజాలు దివీస్ ల్యాబ్, ర్యాన్‌బాక్సీ, సన్ ఫార్మా, ఇప్కా ల్యాబ్, క్యాడిలా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్ 6-2% మధ్య జంప్ చేశాయి. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కేపీఐటీ కమిన్స్, ఒరాకిల్, విప్రో, ఇన్ఫోసిస్ 4-1% మధ్య పురోగమించాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
రానున్న బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు, అంతర్జాతీయ ఆందోళనలు కూడా సెంటిమెంట్‌ను బలహీనపరచాయని చెప్పారు. కాగా, గురువారం రూ. 602 కోట్ల విలువైన షేర్లను విక్రయించని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తాజాగా రూ. 182 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 172 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగడంతో ట్రేడైన షేర్లలో 1,715 లాభపడితే, 1,281 నష్టపోయాయి.