
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నాలుగేళ్లలో ఆదాయాన్ని రూ.6 వేల కోట్ల స్థాయికి తీసుకెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ వెల్లడించింది. కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.2,700 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ‘‘గతేడాది 15 శాతం వృద్ధిని నమోదు చేశాం. ఇప్పటి నుంచి 25 శాతం వృద్ధి రేటును లకి‡్ష్యంచాం’‘ అని సంస్థ ఈడీ నారా బ్రాహ్మణి తెలిపారు.
తమ వ్యాపారంలో 40 శాతం వాటా విలువ ఆధారిత ఉత్పత్తులదేనన్నారు. బుధవారమిక్కడ అల్పెన్వీ పేరిట ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే నాలుగేళ్లలో ఐస్‌క్రీమ్ ఉత్పత్తులపై రూ.80 కోట్ల పెట్టుబడులు పెడతాం. 2022 నాటికి ఐస్‌క్రీమ్‌ల నుంచి రూ.230 కోట్ల వ్యాపారం లకి‡్ష్యంచాం’’ అని తెలిపారు.
ప్రస్తుతానికివి దక్షిణ, పశ్చిమాది రాష్ట్రాల్లోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో లభ్యమవుతాయని.. మెల్లగా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. మిల్క్ క్రీమ్, ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్స్ ఫేవర్లు, ఫార్మాట్లలో లభ్యమవుతాయి. ధరలు రూ.10–45 మధ్యలో ఉంటాయి. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్‌పర్సన్ అండ్ ఎండీ నారా భువనేశ్వరీ, ప్రెసిడెంట్ డాక్టర్ ఎం సాంబశివరావు పాల్గొన్నారు.