చంద్రబాబు, లోకేష్‌ బాటలోనే నారా బ్రాహ్మణి! | Kommineni Comments Over Nara Brahmani's Wrong Statement On AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేష్‌ బాటలోనే నారా బ్రాహ్మణి!

Published Tue, Oct 3 2023 11:15 AM | Last Updated on Wed, Oct 4 2023 10:48 AM

Kommineni Comments Over Nara Brahmani's Wrong Statement On AP - Sakshi

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేయడంలో నెంబర్ వన్ అని ఆయన విమర్శకులు  తరచూ చెబుతుంటారు. ఆ బాటలోనే ఆయన కుమారుడు లోకేష్ కూడా నడుస్తుంటారు. వారికి తోడుగా ఇప్పుడు లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా అసత్యాలు చెప్పడానికి పోటీ పడుతున్నట్లుగా ఉంది. ఆమె స్వయంగా చేశారో.. లేక ఆమె తరపున ఎవరైనా చేశారో కాని.. ఏపీకి పరిశ్రమలు రావడం లేదని, ఉన్నవాటిని తరిమేశారని ఒక ప్రకటన వచ్చింది. దానికి ఆమె లులూ సంస్థ హైదరాబాద్ లో పెట్టిన ఒక మాల్‌ను చూపుతున్నారు. అలాగే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా సంస్థ తెలంగాణలో పెట్టుబడుల ప్రతిపాదనలు చేయడం. అయితే.. ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉంటే ఆమె చెప్పే విషయాలను వినబుద్ది అవుతుంది.

అబద్దాలు ఆడడంలో మామ చంద్రబాబుకు తగ్గ కోడలు అనిపించుకుంటోంది నారా బ్రాహ్మణి. లులూ కంపెనీ విశాఖలో ఒక మాల్ పెడతామని ముందుకు వచ్చినా, చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో ఎందుకు పెట్టలేకపోయారో ఆమె వివరించగలగాలి. ఆ సంస్థవారు ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో మాల్ పెట్టుకున్నారా?.. లేదంటే వాళ్ల సొంత స్థలంలో లేదంటే ఒక మూత పడ్డ మాల్ స్థానే  పెట్టారా?.. మాల్ పెడితే పరిశ్రమలు వచ్చేసినట్లే చెప్పాలనుకుంటే, జగన్ ప్రభుత్వ హయాంలో..  ఏపీలో రామాయపట్నం వద్ద శరవేగంతో ఒక ఓడరేవు నిర్మాణం అవుతోంది. వేలాది మందికి అక్కడ ఉపాధి వస్తోంది. మరి దానిని ఏమనాలి?. విశాఖపట్నంలో ఒక భారీ డేటా సెంటర్ వస్తోంది. ఇన్ఫోసిస్ శాఖ వస్తోంది. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ , కర్నూలులో గ్రీన్ ఎనర్జీ ..ఇలా అనేకం వస్తుంటే.. బ్రాహ్మణికి హైదరాబాద్‌లో పెట్టిన లులూ మాల్ గొప్పదిగా కనిపిస్తోంది. ఇది.. చూసే కళ్లను బట్టి ఉంటుంది.

✍️ఇక జయదేవ్ కు చెందిన అమరరాజా కంపెనీని ఎవరు ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని చెప్పారు? ఆ మాటకు వస్తే ఆయన  చంద్రబాబు టైమ్లో ఎందుకు ఏపీలో  కొత్త పెట్టుబడులు పెట్టలేదో బ్రాహ్మణి చెప్పగలరా? అంతెందుకు.. అసలు తమ కంపెనీ హెరిటేజ్ ను చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీలో ఎందుకు విస్తరించలేదు?. కొత్త ప్లాంట్లు పెట్టలేదు?. కేవలం అమరావతి రాజధాని లో తమకు అనుకూలంగా రింగ్ రోడ్డును ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించి తాము కొన్న భూముల విలువ పెంచుకోవడానికి ప్రయత్నించారే తప్ప.. ఏపీలో ఏమైనా కొత్తగా  హెరిటేజ్ పరిశ్రమ  యూనిట్ పెట్టారా?. ఆమె అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలలో వచ్చే చెత్త కధనాల ఆధారంగా వ్యాఖ్యానించినట్లు అర్ధం అవుతుంది.

✍️ఆ మీడియానే చంద్రబాబును, లోకేష్ ను ముంచాయి. ఇప్పుడు బ్రాహ్మణి వంతు వచ్చినట్లుంది. ఆమె మేలుకోకపోతే ఆమెకే నష్టం అని చెప్పాలి. బ్రాహ్మణి పేరుతో ఈనాడు మీడియా  ప్రకటన రాయడం , ఆ తర్వాత వారి సొంత పైత్యాన్ని జోడించి జగన్ ప్రభుత్వం మీద బురద చల్లడం చేసేసింది. చంద్రబాబు టైమ్ లో పరిశ్రమలకు స్వర్గమట. ఇప్పుడు కాదట. అప్పుడు వచ్చిన ఒక కియా పరిశ్రమ తప్ప ఇంకో పేరు చెప్పే పరిస్థితి లేదు. కియా కు కూడా టిడిపి ప్రభుత్వం రెండువేల కోట్లకు పైగా రాయితీలు ఇచ్చిన సంగతి మర్చిపోయినట్లు ఉన్నారు. తెలంగాణలో వంద కోట్ల పెట్టుబడి వచ్చినా మొదటి పేజీలో ప్రముఖంగా అచ్చేయడం, ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబడి వచ్చినా దానిని కనిపించకుండా రాయడం, పైగా శాపనార్ధాలు పెట్టడం ఈనాడుకు అలవాటైపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పిన చంద్రబాబు వల్ల.. ఏపీకి నష్టం జరగలేదట. అయినా పరిశ్రమలు వచ్చేశాయట. అబద్దాలు రాయడానికి కూడా అంతు ఉండాలి!

✍️విదేశీ పెట్టుబడులకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఈనాడులో వచ్చిన కదనం చదివితే ఆంధ్రప్రదేశ్ పై ఎంత ద్వేషంతో ఈ మీడియా ఉన్నదీ అర్దం అవుతుంది. విదేశీపెట్టుబడులు ఎపి కంటే తెలంగాణకు పది రెట్లు ఎక్కువ అంటూ తాటికాయంత హెడ్డింగ్‌ పెట్టి ఈనాడు పత్రిక తన వికృతానందాన్ని ప్రకటించుకుంది. ఎంత సేపు ఆంధ్రప్రదేశ్ పై పడి ఏడవడం, శాపనార్దాలు పెట్టడం నిత్య కృత్యాలుగా చేస్తున్న ఈనాడు.. ఈ వార్త రాయడానికి మాత్రం ఎంత సంతోషపడి ఉంటుందో. దీనిలోనే వారి రాక్షసత్యం కనిపిస్తుంది. ఈ వార్తలో నిజం ఎంత , అసలు ఇలా విశ్లేషించవచ్చా? అనేవాటిని పక్కనపెడితే ఆ వార్త రాసిన తీరు చూస్తే ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రజల  మెదడులో విషం నింపే యత్నం చేసింది. ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు అంటే కేవలం విదేశీపెట్టుబడులే కాదు. స్వదేశీ పెట్టుబడులు కూడా లెక్కే. కాని  ఈనాడు కావాలని ఈ దిక్కుమాలిన వార్త ఇచ్చింది.

ఈ మధ్యనే ఒక సమాచారం వచ్చింది. పెట్టుబడుల విషయంలో ఏపీ ముందంజలో ఉందన్నది దాని సారాంశం. తెలంగాణ కన్నా, కొన్నివేల కోట్ల రూపాయల పెట్టుబడులు అధికంగా వస్తున్నట్లు కేంద్రమే తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ లో ఏపీ నెంబర్ ఒన్ స్థానాన్ని గత మూడేళ్లుగా పొందుతోంది.ఈ వార్తను తన మీడియాలో ఎన్నడైనా రాసిందా? అది రాయడానికి చేతులు రాని ఈనాడుకు ఈ విదేశీపెట్టుబడుల గురించి రాసే నైతిక హక్కు ఉంటుందా? కేవలం ద్వేషంతో ఈ వార్త వండారని తెలుస్తూనే ఉంది.

✍️ఇదే వార్తలో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వాటి ప్రకారం  ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మహారాష్ట్రలో 36634 కోట్ల విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. తెలంగాణకు 6829 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ఈనాడు ఎపిపై రాసినట్టుగా ఈ రెండు రాష్ట్రాల పెట్టుబడులను ఎందుకు పోల్చలేదు. తెలంగాణకన్నా ఆరు రెట్లు అదనంగా మహారాష్ట్రకు పెట్టుబడులు వస్తున్నాయని ఎందుకు రాయలేదు. నిజానికి అలాంటి పోలికలు సరికాదు. మొత్తం సంవత్సరం అయిన తర్వాత ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందన్నది రాస్తే రాయవచ్చు. అలాగే మొత్తం అన్ని రకాల పెట్టుబడులు కలిపి ఏ విదంగా ఉన్నాయన్నది కథనంగా ఇవ్వవచ్చు. కాని ఈనాడు మాత్రం ఏపీ ద్వేషంతో ఇలాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు. మొదటి ఆరు నెలల ప్రతిపాదనలను చూస్తే  మహారాష్ట్ర కు 69870 కోట్లు వస్తే, డిల్లీకి 27680 కోట్లు,కర్నాటకకు 25680 కోట్లు గుజరాత్ కు 10702 కోట్లు, హరియానాకు 8904 కోట్లు, తెలంగాణకు 8655 కోట్ల ప్రతిపాదనలు వచ్చినట్లు వివరించారు.. ఆ తర్వాత స్థానం తమిళనాడు ఉంది. రాష్ట్రాల మధ్య దీనిని పోల్చి చూస్తే తెలంగాణకన్నా మహారాష్ట్ర ఏడురెట్లు, డిల్లీ మూడు రెట్లు, కర్నాటకకు దాదాపు మూడు రెట్లు అధికంగా విదేశీపెట్టుబడులు వస్తున్నట్లు అంచనా వేశారు. మరి ఆ సంగతిని ఎందుకు పోల్చి చెప్పలేదు.

కేవలం తెలంగాణ, ఏపీల మధ్యనే విదేశీ పెట్టుబడులపైనే ఎందుకు పోల్చారు?అంటే దానర్దం జగన్ ప్రభుత్వంపై ఉన్న అక్కసే అని వేరే చెప్పనవసరం లేదు.. ఇక్కడితో ఆగలేదు. టీడీపీ హయాంలో బాగా విదేశీపెట్టుబడులు వచ్చినట్లు కూడా ఈ పత్రిక ప్రచారం చేసింది.  తీరా చూస్తే ఆ పెట్టుబడుల వివరాలు ఇవ్వకుండా ఏదో శాతం అంటూ సరిపెట్టింది. అంటే అప్పుడు వచ్చిన పెట్టుబడుల వాస్తవ అంకెను ఇస్తే అసలు విషయం అర్దం అయిపోతుందని, టిడిపి పాలన బండారం బయటపడుతుందని ఈనాడు భావించి ఉండాలి. విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకు ఆ స్థాయిలో రావడానికి, ఇతర రాష్ట్రాలకు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. పారిశ్రామిక వాతావరణం ఉన్న తమిళనాడు కూడా ఎందుకు వెనుకబడిందన్నదానిపై విశ్లేషణ చేయాలి. అవేవి చేయకుండా గుడ్డ కాల్చి ఎపిపై ఈనాడు పడేసింది.

✍️అన్నిరకాల పెట్టుబడులు పరిశీలిస్తే ఏపీకి సుమారు రూ. 25 వేల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయి. అప్పుడు తెలంగాణకు చాలా తక్కువ పెట్టుబడి  వచ్చినట్లు ఆ వివరాలు వెల్లడించాయి.అంత మాత్రాన తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదని కాదు. తెలంగాణలో హైదరాబాద్ ఉండడం కీలక విషయం. ఆ నగరం చుట్టూరా ఐటి ,ఇతర సాప్ట్ తరహా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి వేయించిన రింగ్ రోడ్డే  మూలకారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఏపీలో తీర ప్రాంతం అధికంగా ఉంది. అందువల్ల ఇక్కడకు రెన్యుబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు అధికంగా వస్తున్నాయి. ఏపీలో కొత్తగా నాలుగు ఓడ రేవులు నిర్మాణం అవుతున్నాయి. పది ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. వాటన్నిటిని పెట్టుబడుల కింద చూడరా?ఈ ఓడరేవుల ఆధారంగా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. కొత్తగా కొప్పర్తి వద్ద పారిశ్రామిక క్లస్టర్ వస్తోంది. విశాఖలో డేటా సెంటర్ పదిహేనువేల కోట్ల పెట్టుబడితో వస్తోంది.కడప జిల్లాలో 8800 కోట్లతో జిందాల్ స్టీల్ ప్లాంట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి అయింది. శ్రీ సిటీలో ఎసి యూనిట్లు వచ్చాయి. అచ్యుతాపురంలో కొత్త ఫార్మా యూనిట్లు వస్తున్నాయి. మరి ఇవేవి తెలంగాణలో ఏవి అని ఎవరైనా అడిగితే అది తెలివి తక్కువతనం అవుతుంది.ఎందుకంటే తెలంగాణకు తీర ప్రాంతం లేదు.

✍️అలాగే ఏపీకి హైదరాబాద్ వంటి నగరం లేదు. అంత ఖాళీ ప్రదేశం ఉండదు. ఏపీ ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. అయినా దానికి తగిన విదంగానే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి.విశాఖలో ఇన్ ఫోసిస్ తన కార్యకలాపాలు ఆరంభిస్తోంది. అలాగే మరికొన్ని ఐటి యూనిట్లు వస్తున్నాయి. ఐటి రంగం కోసం ఒకప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నారు. నిజమే ..ఇంకా ఎక్కువగా ఏపీకి పెట్టుబడులు వస్తే బాగుంటుందని రాస్తే ఫర్వాలేదు. కానీ, ఏపీని అవమానించే విధంగా అబద్దపు వార్తలు రాయడం ఈనాడుకే చెల్లింది. ఇదంతా కక్ష తప్ప ఇంకొకటికాదు. ప్రజలు అర్ధం చేసుకోలేని అమాయకులు కారు. ఈ మీడియాలో వచ్చే వార్తలనే చంద్రబాబు, లోకేష్ లు ప్రచారం చేస్తుంటారు. సరిగ్గా అదేదారిలో బ్రాహ్మణి కూడా నడుస్తున్నట్లుగా ఉన్నారు. భర్త,మామ మాదిరి తన పరువు కూడా పోగొట్టుకుంటారా?లేక హేతుబద్దంగా మాట్లాడి విలువ నిలబెట్టుకుంటారా?అన్నది ఆమె ఇష్టం.

:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement