ముంబై: ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ హిందాల్కో.. అమెరికాకు చెందిన అల్యూమినియమ్ కంపెనీ ‘అలెరిస్’ను కొనుగోలు చేయనున్నది. వాహన, విమానయాన రంగాల ఉత్పత్తులను అందించే అలెరిస్ కంపెనీని 258 కోట్ల డాలర్లకు(సుమారుగా రూ.17,800 కోట్లు) కొనుగోలు చేయడానికి తమ విదేశీ అనుబంధ కంపెనీ నొవాలిస్ ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుందని హిందాల్కో గురువారం తెలిపింది. క్లీవ్‌ల్యాండ్‌లోని ఓహియో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అలెరిస్ కంపెనీ చేరికతో హిందాల్కో కంపెనీ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద అల్యూమినియమ్ కంపెనీగా నిలుస్తుందని కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా వివరించారు.
అంతేకాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల సెగ్మెంట్లో మరిన్ని విభిన్నమైన ఉత్పత్తులను అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఈ లావాదేవీ 9–15 నెలల్లో పూర్తవ్వగలదని తెలిపారు. ఈ కంపెనీ కొనుగోలుకు కావలసిన నిధులను రుణాల ద్వారా సమీకరిస్తామని వివరించారు. కాగా, అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు స్వల్పకాలిక చర్యేనని, స్వల్ప ప్రభావమే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అలెరిస్ కంపెనీకి ఉత్తర అమెరికా, చైనా, యూరప్ దేశాల్లో మొత్తం 13 ప్లాంట్లున్నాయి. హిందాల్కో కంపెనీ పదేళ్ల క్రితం అమెరికాకు చెందిన నొవాలిస్ కంపెనీని 600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇదే అతి పెద్ద కొనుగోలు.
Comments
Please login to add a commentAdd a comment