హిందుస్తాన్ జింక్ లాభం రూ.2,149 కోట్లు
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో తైమాసిక కాలానికి రూ.2,149 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో సాధించిన నికర లాభం(రూ.1,997కోట్లు)తో పోల్చితే 8 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్ జింక్ వెల్లడించింది. 2014-15 క్యూ4లో రూ.4,126 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 20 శాతం తగ్గి రూ.3,132 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్ జింక్ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు.
కమోడిటీ ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు, మార్కెట్ సెంటిమెంట్ కుదేలై ఉండడం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, మంచి పనితీరు కనబరిచామని వివరించారు. గత నెలలో తమ వాటాదారులకు ప్రత్యేక స్వర్ణోత్సవ డివిడెండ్‌ను చెల్లించామని పేర్కొన్నారు. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు 0.4 శాతం నష్టపోయి రూ.174 వద్ద ముగిసింది.