వాయిదాలకూ పద్ధతులున్నాయ్! | Home Loan Balance Transfer – Check Banks | Sakshi
Sakshi News home page

వాయిదాలకూ పద్ధతులున్నాయ్!

Published Mon, Nov 2 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

వాయిదాలకూ పద్ధతులున్నాయ్!

వాయిదాలకూ పద్ధతులున్నాయ్!

బ్యాంకులు ఈ మధ్యే వడ్డీ రేట్లు కొంత తగ్గించాయి. గృహ రుణాలు కొంత ఆకర్షణీయంగా మారాయి. కోరుకుంటున్న ఇంటిని ఇక వాయిదాల్లో సొంతం చేసుకోవచ్చు అనుకుంటున్న వారు... దాన్ని తిరిగి చెల్లించేందుకు అందుబాటులో ఉన్న పద్ధతుల గురించి కూడా వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే.. వీటిపై అవగాహన ఉంటే  సునాయాసంగా రీపేమెంటు చేయొచ్చు. అలాంటి విధానాల్లో కొన్ని మీకోసం...
 
* రుణాల రీపేమెంట్‌లో పలు ఆప్షన్లు    
* ఆదాయాన్ని బట్టి ఈఎంఐలలో హెచ్చుతగ్గులు
 
క్రమంగా పెంచుకునే రీపేమెంట్...
స్టెప్ అప్ రీ-పేమెంట్‌గా పిలిచే ఈ ఆప్షన్... ఉద్యోగం, లేదా వ్యాపారం ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్న వారికి బాగా పనికొస్తుంది. ఎందుకంటే కెరీర్ మొదట్లో వారికి ఆదాయం తక్కువగా ఉం టుంది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుం టుంది. దీనికి అనుగుణంగానే ఈ విధానంలో ఈఎంఐలు ఉంటాయి. ప్రారంభంలో తక్కువగా ఉండే ఈఎంఐ... ఆదాయం పెరిగే కొద్దీ పెరుగుతుంటుంది.
 
సరళీకృత రుణ వాయిదాలు...
ఫ్లెక్సిబుల్ లోన్ ఈఎంఐలుగా పిలిచే ఈ ఆప్షన్... కెరీర్ ప్రారంభంలో ఉన్న వారికి కాకుండా రిటైర్మెంట్‌కు దగ్గరవుతున్నవారికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని స్టెప్ డౌన్ విధానంగా కూడా వ్యవహరిస్తారు. స్టెప్ అప్‌లో కట్టాల్సిన ఈఎంఐ మొత్తం.. ఏటా పెరుగుతూ పోతే, ఈ స్టెప్ డౌన్‌లో క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఉద్యోగం చేస్తున్నన్నాళ్లూ ఈఎంఐ అధిక మొత్తం ఉంటుంది. తర్వాత రిటైరయ్యే నాటికి బాగా తగ్గిపోతుంది.
 
దశలవారీ చెల్లింపు..
నిర్మాణ దశలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రాపర్టీ పూర్తిగా చేతికొచ్చే దాకా ఎంత ఈఎంఐ కట్టాలనుకుంటున్నారన్నది మీరే ఎంపిక చేసుకోవచ్చు. ప్రాపర్టీ నిర్మాణ దశలో ఉండగానే రుణగ్రహీత కొంత భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా బ్యాంకులు ఈ విధానాన్ని అందిస్తున్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఇంటిని తీసుకునేటప్పుడు దానికి పక్కాగా అన్ని అనుమతులూ ఉన్నాయో లేదో చూసుకోవటం మాత్రం ముఖ్యం.
 
త్వరితగతి రీపేమెంట్..
మీ దగ్గర అదనంగా నిధులు ఉన్నప్పుడు... ఈఎంఐ మొత్తానికి మరికాస్త జోడించి కట్టే వెసులుబాటు కల్పిస్తుందీ యాక్సిలరేటెడ్ రీపేమెంట్ స్కీము. దీనివల్ల రుణం త్వరితగతిన తీరడంతో పాటు వడ్డీ భారమూ కాస్త తగ్గుతుంది.
 
స్మార్ట్‌ఫిక్స్ విధానం..
ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల మేళవింపుతో ఉండే ఈఎంఐల విధానమే స్మార్ట్‌ఫిక్స్. దీనికి తొలి మూడేళ్ల పాటు కట్టాల్సిన ఈఎంఐని... ఫిక్స్‌డ్ వడ్డీ రేట్ల ప్రాతిపదికన లెక్కిస్తారు. ఈ స్థిర వడ్డీ రేటును బ్యాంకే నిర్ణయిస్తుంది. ఇక నాలుగో సంవత్సరం నుంచి ఫ్లోటింగ్ (చలన) ప్రాతిపదికన నెలవారీ కట్టాల్సిన ఈఎంఐ మొత్తాన్ని లెక్కిస్తుంది. ఒకవేళ వడ్డీ రేటు పెరిగితే ఆ మేరకు మీరు కట్టాల్సిన వడ్డీ మొత్తం పెరుగుతుంది. అలాగాకుండా వడ్డీ రేటు తగ్గితే.. ఇదీ తగ్గుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement