ఇళ్ల కొనుగోలుకు హైదరాబాద్, విజయవాడ బెస్ట్!
ఇళ్ల కొనుగోలుకు హైదరాబాద్, విజయవాడలు అత్యుత్తమమని ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా ఒక నివేదికలో సూచించింది. ‘క్రియేటింగ్ వెల్త్ విత్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్’ పేరుతో జేఎల్‌ఎల్ విడుదలచేసిన నివేదికలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు దేశంలో కొన్ని కీలక ప్రాంతాలను సిఫార్సు చేసింది. దక్షిణాదిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, విజయవాడలను సంస్థ సూచించింది. సంస్థ సూచించిన మరికొన్ని ప్రాంతాల్లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్, లక్నో, చండీఘర్, జైపూర్, డెహ్రాడూన్, భువనేశ్వర్, కోల్‌కతా, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్‌లు ఉన్నాయి.
చదరపు అడుగుకు రూ.2,500-రూ.5000 శ్రేణి ఉత్తమం
చదరపు అడుగుకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకూ పెట్టుబడి అత్యుత్తమమనీ నివేదికలో సూచించింది. అటు పెట్టుబడిపరంగా, ఇటు ధర పెరగడానికి ఈ శ్రేణి తగిన స్థాయి అని నివేదిక వివరించింది.
ప్రదేశం కీలకం...
ఏ స్థాయి వద్ద హౌసింగ్‌లో పెట్టుబడి పెట్టాలన్న అంశంపై నివేదిక నిర్దిష్ట ప్రమాణాలను ప్రస్తావించింది. కొనుగోలు విషయంలో ‘ప్రదేశం ఎక్కడ’ అనే విషయం కీలకమని తెలిపింది. అక్కడ మంచి మౌలిక సదుపాయాలు ఉండాలనీ, రవాణా వ్యవస్థ బాగుండాలనీ, ఆ ప్రాంతం వృద్ధికి తగిన పరిస్థితులూ కీలకమని జేఎల్ ఇండియా చైర్మన్ అండ్ కంట్రీ హెడ్ అనూజ్ పురి ఈ సందర్భంగా పేర్కొన్నారు. టైర్ 1 ,టైర్ 2 నగరాల్లో పెట్టుబడులు బాగుంటాయనీ వివరించింది.
ఇక ఇన్వెస్టరు రియల్టీ అమ్మకాలు జరపాల్సి వస్తే... తగిన లాభాలకు తగిన సమయం కీలకమనీ విశ్లేషించింది. తాము సూచించిన ప్రమాణాలకు లోబడిన కొనుగోళ్లకు ధర వచ్చే మూడేళ్లలో వార్షికంగా 15 శాతం పెరుగుతుందని అంచనావేసింది. ఒక అసెట్‌ను దాదాపు ఎవ్వరూ గరిష్ట స్థాయి వద్ద అమ్మి సొమ్ము చేసుకోలేరనీ, అలాగే కనిష్ట స్థాయి వద్ద ఎవ్వరూ కొనుగోలు చేయలేరన్న విషయాన్ని గుర్తెరగాలని కూడా నివేదిక పేర్కొంది.