30% వాటాతో అగ్రస్థానంలో ఉన్నాం | How Apollo Tyres made a comeback after a disastrous 2013 | Sakshi
Sakshi News home page

30% వాటాతో అగ్రస్థానంలో ఉన్నాం

Published Wed, Nov 26 2014 1:11 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

30% వాటాతో అగ్రస్థానంలో ఉన్నాం - Sakshi

30% వాటాతో అగ్రస్థానంలో ఉన్నాం

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: అపోలో టైర్స్.... దేశంలో వాణిజ్యవాహనాల మార్కెట్ విభాగంలో 30 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఏటా రూ. 10 వేల కోట్ల (2 బిలియన్ డాలర్లు) టర్నోవర్‌తో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టైర్ల కంపెనీగా గుర్తింపు పొందింది. యూరప్‌లో 3,500 డీలర్లు, ఇండియాలో 4,900 రిటైల్ ఔట్‌లెట్లతో ప్రపంచవ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులు కలిగిన అపోలో టైర్స్ దేశీయ టైర్ల రంగంలో తొలి బహుళజాతి టైర్ల కంపెనీగా తన జైత్ర యాత్ర కొనసాగిస్తోంది.

 దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో రేడియల్ టైర్ల సెగ్మెంట్లో  తమ పట్టు మరింత పెంచుకునేందుకు వచ్చే రెండు మూడేళ్లలో రూ. 1,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ సతీష్ శర్మ సాక్షి ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా ఎదగాలన్నదే తమ లక్ష్యం అన్నారు. చైనా పోటీతో  టైర్ల మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతోపాటు రానున్న రోజు ల్లో సంస్థ వ్యూహాలు, విస్తరణ లాంటి పలు అంశాలపై ఇంటర్వ్యూలో వివరించారు.

 ఆ వివరాలు...
 అపోలో టైర్స్ ప్రస్థానం?
 కేరళలో 1976లో పెరంబారే ప్రాంతంలో తొలి ప్లాంట్ నెలకొల్పాం. 1991లో గుజరాత్‌లో రెండోప్లాంట్, 1995లో కేరళలో మూడోప్లాంట్ ఏర్పాటు చేశాం. 2006లో డన్‌లప్ ఆఫ్రికా యూనిట్‌ను కొనుగోలు చేశాం. 2009లో నెదర్లాండ్స్‌కు చెందిన వ్రెడ్‌స్టైన్, 2010లో చెన్నైలో గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు. ఈ ఏడాది తూర్పు ఐరోపాలో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టును చేపడుతున్నాం. చెన్నై ప్లాంట్ అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచదృష్టిని ఆకర్షిస్తోంది.

 టైర్స్ రంగంలో ఇండియన్ ఎంఎన్‌సీగా ఎలా ఎదిగారు?
 ఇండియా తర్వాత ఐరోపాలో మేం చాలా బలంగా ఉన్నాం. ముడిసరుకు రబ్బర్‌పై లోతైన అవగాహన మాకు వుంది. రహదారి భద్రత అంశంలో రాజీలేని ఉత్పత్తుల తయారీకి మొగ్గుచూపాం. దీంతో సేఫ్టీ విషయంలో మాకు పోటీనే లేదు. ఆఫ్రికా,ఐరోపాల్లో డన్‌లప్, వ్రెడ్‌స్టైన్ సంస్థలను కొనుగోలు చేయటంతో అక్కడ బలపడ్డాం. మాకు ఐరోపాలో డీలర్ నెట్‌వర్క్ దాదాపు ఇండియాకు సమానంగా ఉంది. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా తూర్పూ ఐరోపాలోని హంగరీలో మరో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌ను నెలకొల్పుతున్నాం. వచ్చే ఐదేళ్లలో ఇక్కడ 475 మిలి యన్ యూరోల పైచిలుకు పెట్టుబడులు చేస్తున్నాం.

 రేడియల్ టైర్ల మార్కెట్‌లో వృద్ధి ఎలా వుంది?
 దేశంలో వినియోగించే టైర్లలో రెండింట మూడొం తులు రేడియల్ టైర్లే. బస్సులు, లారీలు, ట్రక్కులకు ఈ టైర్లను విరివిగా వాడుతారు. ఏటా 25% సంచిత వృద్ధితో పురోగమిస్తున్నాం. వచ్చే రెండు మూడేళ్లలో రేడియల్ టైర్స్ స్థాపక సామర్థ్యం రోజుకు 8,900 టైర్లకు పెంచేలా ప్లాంట్ల ఆధునీకరణ, విస్తరణ పనుల కోసం రూ.1,500 కోట్లు కేటాయించాం. అపోలో టైర్స్ మార్కెట్ షేర్ 30%. మేమే నంబర్ వన్.

 టైర్ల మార్కెట్లో చైనా పోటీ ఎలా ఉంది?
 చైనా టైర్లు ఇక్కడి మార్కెట్‌ను దెబ్బకొడుతున్నాయి. వినియోగదారులకు రోడ్ సేఫ్టీపై అవగాహన లేకపోవటంతో చౌక టైర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దేశంలో 10% వాటా చైనా టైర్లదే అంటే అతిశయోక్తి కాదు. చైనా టైర్ల దిగుమతి దారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా దేశీయ టైర్ల తయారీదారులు కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఎన్నో విన్నపాలు ఇచ్చాయి. అయినా చైనా ధాటిని కట్టడిచేయలేకపోవటంతో దేశీయ పరిశ్రమలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.

 ప్రస్తుతం పరిశ్రమను కుదిపేస్తున్న సమస్యలు?
 అధిక ఉత్పాదక సామర్థ్యం. అంచనాలను మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటంతో డిమాండ్‌కంటే సరఫరా అధికమైపోతున్నది. స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ) 7 శాతం పైగా ఉంటే ప్రస్తుత స్థాపిత సామర్థ్యానికి తగిన డిమాండ్ ఏర్పడుతుంది. దేశీయ కంపెనీలైన ఎంఆర్‌ఎఫ్, జేకే టైర్స్‌తో పాటు  బ్రిడ్జిస్టోన్ లాంటి విదేశీ సంస్థలూ కెపాసిటీ పెంచాయి. కొత్త ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తున్నాయి.  

 మార్కెట్ వాటా వివరాలు?
 వాణిజ్యవాహనాల విభాగంలో మేం 30 శాతంతో నంబర్ వన్‌గా ఉన్నాం. ఇక ప్యాసింజర్ కార్ల విభాగంలో మా వాటా  17 శాతం. అయితే ఈ సెగ్మెంట్లో 30కి పైగా టైర్ బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 17 శాతం వాటా గణనీయమైనదే. వచ్చే రెండేళ్లలో 25 శాతానికి పెంచాలన్నది మా లక్ష్యం.

 ఆధునీకరణ, విస్తరణ వ్యూహాలు?
 వచ్చే రెండు మూడేళ్లలో చెన్నై, కేరళ ప్లాంట్లను విస్తరిస్తున్నాం. ఇక్కడ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆఫ్‌హైవే టైర్ల ఉత్పత్తి, ఫ్లోటింగ్ టైర్స్, అగ్రి టైర్స్, ఓటీఆర్ టైర్ల ఉత్పత్తిని చేపడుతున్నాం. దీని కోసం రూ. 500 కోట్లు వెచ్చిస్తున్నాం.

 ఏపీ, తెలంగాణ మార్కెట్ ప్రణాళికలు?
 మొదటి నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో మాకు మంచి పట్టుంది. పటిష్టమైన డీలర్ నెట్‌వర్క్ ఉంది. వినియోగదారుల అవసరాల మేరకు మరిన్ని కేంద్రాల్లో నెట్‌వర్క్ పెంచే ఆలోచన ఉంది. విజయవాడ, వైజాగ్ కేంద్రాల్లో రీట్రెడ్డింగ్‌పై అవగాహన కేంద్రాలను తరచు నిర్వహిస్తుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement