బడ్జెట్‌పై ఆశావహ అంచనాలకు తోడు రేట్ల పెంపు విషయంలో ఓపికగా వ్యవహరిస్తామంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వెల్లడించడంతో స్టాక్ మార్కెట్ గురువారం జోరుగా ర్యాలీ జరిపింది. దీంతో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈ నాలుగు రోజుల పతనం కారణంగా నష్టపోయి, ఆకర్షణీయంగా ఉన్న వాహన, బ్యాంక్, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో వేల్యూ బయింగ్ జరగడం కలసివచ్చింది. సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు చైనా–అమెరికాల మధ్య జరుగుతున్న చర్చలపై ఆశావహ అంచనాలు నెలకొనడం, దీంతో ప్రపంచ మార్కెట్లు పెరగడం సానుకూల ప్రభావం చూపించింది. జనవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు భారీగా జరగడం కూడా స్టాక్ మార్కెట్ ర్యాలీకి ఒక కీలక కారణమని నిపుణులు పేర్కొన్నారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 665 పాయింట్లు లాభపడి 36,257 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 10,831 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్నిసూచీలు లాభాల్లోనే ముగిశాయి.
భారీ లాభాలతో మొదలు...
రేట్ల పెంపు విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ ‘ఓపిక’ నిర్ణయం ఆసియా మార్కెట్లను లాభాల బాట పట్టించింది. దీంతో మన మార్కెట్ భారీ లాభాలతో ఆరంభమైంది. సెన్సెన్స్ 215 పాయింట్లు, నిఫ్టీ 39 పాయింట్ల లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రోజు గడుస్తున్న కొద్దీ కొనుగోళ్ల జోరు కొనసాగి లాభాలు అంతకంతకూ పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 687 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్ల వరకూ లాభపడ్డాయి.
ఆల్‌టైమ్ గరిష్టానికి.. యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.726ను తాకింది. చివరకు 4.6 శాతం లాభంతో రూ.723 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్ క్యూ3 ఫలితాలు అంచనాలను అధిగమించడంతో గత మూడు రోజుల్లో ఈ షేర్ 10% వరకూ ఎగసింది.
∙స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.69 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.1,39,30,614 కోట్ల నుంచి రూ.1,40,99,330 కోట్లకు ఎగసింది.
లాభాలు ఎందుకంటే..
బడ్జెట్ భల్లే...భల్లే...!
మోదీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌ను నేడు(శుక్రవారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నది. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో వ్యవసాయ, వినియోగ రంగాలకు జోష్‌నిచ్చేలా భారీ ప్రకటనలు ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ చేసిన ప్రసంగం... రైతు, గ్రామీణ ప్రాంతాలకు జోష్‌నిచ్చే నిర్ణయాలు బడ్జెట్‌లో ఉంటాయని సంకేతాలు ఇచ్చిందని విశ్లేషకులంటున్నారు. ప్రజాకర్షక పథకాలు ఉన్నప్పటికీ, ద్రవ్యలోటు కట్టుతప్పక పోవచ్చనే ధీమాడతో కొనుగోళ్లు జోరు నెలకొంది.
రేట్ల పెంపుపై ఫెడ్ ‘ఓపిక’
రేట్ల పెంపు విషయమై ఈ ఏడాది ఓపికతో వ్యవహరిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్పష్టం చేసింది. అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగు పడుతున్నా, చైనా, యూరప్‌ల్లో మందగమనం చోటు చేసుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఆర్థిక వృద్ధి కొంత మందగమనంగా ఉన్నప్పటికీ, ఈ ఏడాది వృద్ధి మెరుగ్గానే ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రేట్ల విషయంలో ఓపిక విధానమే సరైనదని భావిస్తున్నామని వివరించారు. మొత్తం మీద దశల వారీ రేట్లపెంపు విధానానికి ఫెడరల్ రిజర్వ్ స్వస్తి చెప్పినట్లేనని, ఈ ఏడాది రేట్ల పెంపు ఉండకపోవచ్చని, ఉన్నా ఒక దఫా మాత్రమే పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో భారత్ వంటి వర్థమాన దేశాల్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు జోరందుకుంటాన్న అంచనాలతో స్టాక్ సూచీలు కదం తొక్కాయి.
ప్రపంచ మార్కెట్ల జోరు...
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుపై ఓపిక విధానాన్ని అవలభించడం, చైనా–అమెరికాల మధ్య చర్చలపై ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లు జోరుగా పెరిగాయి. బుధవారం అమెరికా మార్కెట్లు జోరుగా పెరిగాయి. ఈ దన్నుతో ఆసియా మార్కెట్లు 1% వరకూ లాభపడగా, యూరప్ మార్కెట్లు భారీ లాభాలతో ఆరంభమయ్యాయి.
షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల జోరు
జనవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు గురువారమే చివరి రోజు. దీంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు భారీగా జరిగాయి. మరోవైపు రోల్ ఓవర్లు కూడా భారీగానే చోటు చేసుకున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వెల్లడించింది.
హెవీ వెయిట్స్ ర్యాలీ...
సెన్సెక్స్‌లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఇన్ఫోసిస్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ తదితర షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఈ షేర్లన్నీ 1–4 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.
‘ఫెడ్’ బుల్..!
Published Fri, Feb 1 2019 4:53 AM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment