రిలయెన్స్ ‘డేటాగిరీ’ నడుస్తుందా?
న్యూఢిల్లీ: బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబాని గురువారం నాడు ‘రిలయెన్స్ జియో’ అనే కొత్త మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రక టించడం ద్వారా భారత టెలికామ్ రంగంలో విప్లవాన్నే సృష్టించారు. ధరల యుద్ధానికి తెరలేపారు. ఫలితంగా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు కూడా తమ డేటా చార్జీలను తగ్గించుకోక తప్పలేదు. సెప్టెంబర్ ఐదవ తేదీన అమల్లోకి వస్తున్న ‘రిలయెన్స్ జియో’ మార్కెట్‌లో ఎంత వరకు విజయం సాధిస్తుంది? ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటుందా? దేశంలోని టెలికామ్ వినియోగదారులంతా జియో నెట్‌వర్క్ వైపు మళ్లుతారా? అన్న అంశాలను అన్ని కోణాల నుంచి నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
50 రూపాయలకే గిగాబైట్ డేటాను ఇస్తామని చెప్పడం, రాత్రిపూట మూడు గంటల పాటు అన్ లిమిటెడ్ డేటా డౌన్‌లోడ్‌కు అవకాశం ఇవ్వడంతోపాటు అన్ని వాయిస్ కాల్స్‌ను ఉచితంగా ఇస్తామనడం అన్నింటికన్నా ఆకర్షణీయమైన అంశం. భారతీయ సంచార నిగమ్ లిమిటెడ్ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే 48 రూపాయల ప్యాకేజీపైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను ఇస్తోంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు వెయ్యి రూపాయల ప్యాకేజీలపై అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను ఇస్తోంది. అంటే ఉచితంగా వాయిస్ కాల్స్ ఇవ్వడం దేశంలో రిలయెన్స్‌తోనే ప్రారంభం కాలేదు. కాకపోతే అన్ని ప్యాకేజీల వారికి ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని కల్పించడం రిలయెన్స్ కంపెనీతోనే మొదలైందని చెప్పవచ్చు.
రిలయెన్స్ ధాటికి తట్టుకోలేక డేటా చార్టీలను ఇప్పటికే తగ్గించిన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా టెలికమ్ కంపెనీలు వాయిస్ కాల్స్ చార్జీలను మాత్రం తగ్గించలేదు. ఆ కంపెనీలకు 70 శాతం రెవెన్యూ ఈ వాయిస్ కాల్స్‌పైనే వస్తున్నాయి. పైగా ప్రపంచంలోకెల్లా వాయిస్ కాల్స్ ఛార్జీలు భారత్‌లోనే తక్కువగా ఉన్నాయి. భారత్‌లో ప్రధాన టెలికమ్ కంపెనీలు నిమిషం వాయిస్ కాల్‌కు సరాసరి సగటున 65 పైసలు వసూలు చేస్తుండగా, ప్రపంచంలో వివిధ దేశాల్లో 1.3 రూపాయల (హాంకాంగ్‌లో) నుంచి 45 రూపాయల (జపాన్) వరకు వసూలు చేస్తున్నాయి.
ముకేశ్ అంబానీ అన్ని ప్యాకేజీలపై వాయిస్ కాల్స్, ఎస్‌ఎమ్మెస్‌లు ఉచితమని ప్రకటించారుగానీ టారిఫ్‌లకు సంబంధించిన బ్రోచర్లను మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు. బ్రోచర్లలో కొన్ని మార్పులు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి. రిలయెన్స్ జియోలో ఉచిత వాయిస్ కాల్స్ ఎంతో ఆకర్షణీయమైనప్పటికీ ప్యాకేజీల ప్రకారం చూస్తే యాభై రూపాయలకు గిగాబైట్ మరీ అంత ఆకర్షణీయం కాకపోవచ్చని, యాభై రూపాయలు చీప్ అనుకొని నెలకు ఒక జీబీకన్నా ఎక్కువ వాడితే 149 రూపాయల ప్యాకేజీ వర్తించదు కనుక 499 రూపాయలకు 4జీబీ ప్యాకేజీలో పడే ప్రమాదం ఉంది.
ఇక 999 రూపాయలకు 10 జీబీ ప్యాకేజీని రిలయెన్స్ జీయో ఇస్తోంది. కానీ బీఎస్‌ఎన్‌ఎల్ అంతే రేటుకు అంటే వెయ్యి రూపాయలకు అన్‌లిమిటెడ్ డేటా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌యే బెటర్ గదా! రాత్రి పూట, అంటే తెల్లవారి జామున రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాకు అవకాశం ఇచ్చారని, ఆ సమయంలో డేటా డౌన్‌లోడ్ చేసుకునేవారి వినియోగదారుల సంఖ్య పరిమితంగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఏ ర కంగా చూసుకున్నా ఉచిత వాయిస్ కాల్స్‌ను కోరుకునే వారికి రిలయెన్స్ జియో ఉత్తమ ఆప్షన్‌గా కనిపిస్తోంది. వంద రూపాయల ప్యాకేజీలో కోటి మంది చేరినా నెలకు వంద కోట్ల రూపాయల టర్నోవర్ కంపెనీకి వస్తుంది. డేటా డౌన్‌లోడ్ విషయంలో స్పీడ్, సిగ్నల్ వ్యవస్థ పనితీరు లాంటి అంశాలు కూడా ముఖ్యమే. నెట్‌వర్క్ అమల్లోకి వస్తేగాని వాటిని అంచనావేయలేం.