ప్లాటైనా.. ఫ్లాటైనా.. గురి చూసి కొట్టాలి! | how target for buy for own house? | Sakshi
Sakshi News home page

ప్లాటైనా.. ఫ్లాటైనా.. గురి చూసి కొట్టాలి!

Published Sat, Nov 7 2015 1:16 AM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM

ప్లాటైనా.. ఫ్లాటైనా.. గురి చూసి కొట్టాలి! - Sakshi

ప్లాటైనా.. ఫ్లాటైనా.. గురి చూసి కొట్టాలి!

స్థిరాస్తి.. దొంగలు ఎత్తుకుపోతారన్న దిగులక్కర్లేదు! హఠాత్తుగా విలువ తగ్గుతుందన్న ఆందోళన అవసరం లేదు!! ఎప్పటికైనా విలువ పెరుగుతుందే తప్ప తగ్గనే తగ్గదు.
 ఇలాంటి సానుకూలాంశాల కారణంగా చాలామంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడతారు.
స్థలాలు, ఫ్లాట్లు, వాణిజ్య స్థలాల్ని కొనడానికి ముందుకొస్తారు. లాభాలే కాదు..
మోసాలకు, వివాదాలకూ ఈ రంగం పెట్టింది పేరని గుర్తుంచుకోవాలి.
కాబట్టి స్థిరాస్తులు కొనేముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.    
 
- సాక్షి, హైదరాబాద్
 
సొంతిల్లా?
ఇప్పటికే సొంతిల్లు ఉండి.. రెండో ఇంటిపై పెట్టుబడి పెట్టే వారు అద్దెల ద్వారా ఆదాయం, లేదంటే మంచి ధరొస్తే అధిక రేటుకు అమ్ముకోవడానికి ప్రాధాన్యమిస్తారు. వీటి విలువ వాణిజ్య భవనాల కంటే తక్కువగా ఉండటం, గృహ రుణాలపై పన్ను మినహాయింపు వంటి ఆర్థిక ప్రయోజనాలుంటాయి.
 
ఏం చేయాలి?
* మార్కెట్లో బిల్డర్‌కు ఎలాంటి పేరుందో ఆరా తీయాలి. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ ప్రాంతంలో ఉంది? అన్న విషయాలను బట్టే మీరు కొనబోయే ఇంటి విలువ ఎంత పెరుగుతుందనేది ఆధారపడుతుంది. వీటితో పాటు భవన ప్రణాళిక, అనుమతులు, యాజమాన్య హక్కులనూ పరిశీలించాలి.
* ఫ్లాట్/ఇల్లు నివాసానికి సిద్ధంగా ఉన్నవి, లేదంటే నిర్మాణం పూర్తి కావచ్చినవి కొనడం వల్ల రాబడిని త్వరగా అందుకోవచ్చు. ఇలాంటి ఇళ్లను కొంటే.. వెంటనే అద్దెకిచ్చి ఆదాయం పొందవచ్చు.
* అభివృద్ధికి ఆస్కారం గల ప్రాంతంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ఇంటిని కొంటే రెండిందాల లాభం. ప్రాజెక్టు పూర్తి కాగానే నెలనెలా అద్దె పొందొచ్చు. ఇంటి విలువ వేగంగా పెరుగుతుంది.
* దాచుకున్న సొమ్ముతో ఇల్లు కొంటే నెలవారీ వాయిదాల భారం లేకుండా చూసుకోవచ్చు.
 
ఏం చేయకూడదు?
పేపర్ వర్క్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. సాధ్యమైనంత వరకు మీరు కొనబోయే ఇంటికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలుసుకోండి.
 
స్థలం కొంటున్నారా?
భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో అందరూ స్థలాలు కొనలేని పరిస్థితి. ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం రుణాలు తీసుకుని మరీ ప్లాట్లు, వారాంతపు ఇళ్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
 
ఏం చేయాలి?
* మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతంలోనే స్థలాలు కొనుగోలు చేయండి.
* మీరు కొనబోయే స్థలాన్ని ఎవరైనా లీజుకు తీసుకున్నారా? ఖాళీగా ఉందా? అన్నది చూడాలి. ఆ స్థలం వ్యవసాయ భూమా, వ్యవసాయేతర భూమా? ఆ భూమిపై చెల్లించాల్సిన రుసుములేమైనా ఉన్నాయా వంటివి చూడాలి. ఒకవేళ మీరు రైతుగా భూమిని కొనుగోలు చేస్తుంటే.. మీరు వ్యవసాయ రంగంలో ఉన్నారని నిర్ధారించే పత్రాల్ని చూపించాల్సి ఉంటుంది.
 
ఏం చేయకూడదు?
* తక్కువ ధరకు వస్తుందని తొందరపడొద్దు. స్థలానికి రవాణా మార్గం, అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి.
 
వాణిజ్య భవనాల్లో..
అద్దెల రూపంలో మంచి ఆదాయం ఆశించే వారికి నివాస భవనాలతో పోలిస్తే వాణిజ్య భవనాలే మేలు.
 
ఏం చేయాలి?
* నగరాల్లోని ప్రధాన ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి.
* మీరు కమర్షియల్ స్పేస్ కొనుగోలు చేసే ప్రాజెక్ట్‌లో ఎలాంటి కార్యాలయాలు ఏర్పాటవుతాయో తెలుసుకోండి. దీన్ని బట్టి మీ స్థలానికి విలువెంత పెరుగుతుందనే విషయం ఆధారపడి ఉంటుంది.
* కొనుగోలు చేయడానికి ముందే లీజ్‌లో ఉన్న షాపులు/కమర్షియల్ స్పేస్‌లో పెట్టుబడి పెడితే నెలనెలా స్థిరాదాయం లభిస్తుంది. ఇలాంటి వాటిలో పెట్టుబడి వల్ల క్రమంగా ఆదాయం రావడంతో పాటు ఆస్తి విలువ పెరుగుతుంది.
* మరొకరితో కలసి పెట్టుబడి పెట్టాలనుకుంటే... భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోండి. దీని వల్ల ఖర్చుల్లో భాగం పంచుకోవడంతో పాటు, మీ పెట్టుబడికి రక్షణగా ఉంటుంది.
 
ఏం చేయకూడదు?
* అభివృద్ధి చెందని ప్రాంతంలో కమర్షియల్ స్పేస్ కొనకపోవడమే ఉత్తమం.
* చౌకగా వస్తుందని తొందరపడి పెట్టుబడి పెట్టొద్దు. నిర్మాణ నాణ్యత, కమర్షియల్ స్పేస్ లేఅవుట్‌ను పరిశీలించడం ఎంతో ముఖ్యం.
* సొమ్ము చేతిలో లేకపోయినా కొనడం తెలివైన మదుపరుల లక్షణం కాదు. కమర్షియల్ స్పేస్‌పై పెట్టే పెట్టుబడిపై పన్నురాయితీలు ఉండవని గుర్తుంచుకోండి. రుణాలపై వడ్డీ రేట్లు కూడా అధికమేనన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. వీటిపై వడ్డీ సుమారుగా 15-16 శాతం వరకు ఉండొచ్చు.

స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి.  realty@sakshi.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement