ఈజీ క్లెయిమ్‌కు ఇవి తప్పనిసరి
జీవిత బీమా పాలసీల్లో క్లెయిమ్ అనేది చాలా ముఖ్యమైన, సున్నితమైన అంశం. సకాలంలో క్లెయిమ్ మొత్తం అందకపోతే వారి బాధ మరింత పెరుగుతుంది. సాధారణంగా జీవిత బీమా పాలసీల్లో డెత్, మెచ్యూరిటీ, రైడర్స్ మూడు రకాలైన క్లెయిమ్‌లుంటాయి. మెచ్యూరిటీ క్లెయిమ్ అనేది పాలసీ కాలపరిమితి అయిన తర్వాత జరిగితే మిగిలిన రెండు ఏదైనా దురదృష్టకర సంఘటన చోటు చేసుకున్నప్పుడు సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ క్లెయిమ్‌లు పరిష్కరించడంలో జాప్యం జరుగుతుంది. పాలసీ తీసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవు.
పూర్తి సమాచారం తప్పనిసరి...
చాలా సందర్భాల్లో క్లెయిమ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం సరైన సమాచారం లేకపోవడం, లేకుంటే పాత వివరాలుండటం. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు తప్పులు లేకుండా పూర్తి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ చిరునామా, ఫోన్ నంబర్లు మారితే వాటి వివరాలను తక్షణం బీమా కంపెనీకి తెలియచేయాలి. లేదంటే క్లెయిమ్ ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువ.
సమాచారం దాచొద్దు...
అనవసర భయాలతో కొంత సమాచారం దాచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. క్లెయింలు జాప్యానికి లేదా తిరస్కరించడానికి ఇదే ప్రధాన కారణం. పాలసీ ప్రపోజల్ ఫామ్‌లోనే ఆరోగ్య స్థాయి, వృత్తి, ఆహారపు అలవాట్లు, శారీరక వైకల్యాలు, ఇతర వివరాలన్నీ సక్రమంగా ఇవ్వాలి. పూర్తి సమాచారాన్ని ముందుగానే అందిస్తే క్లెయిమ్‌లలో జాప్యమయ్యే అవకాశాల్ని తగ్గించొచ్చు.
నామినీ మరవొద్దు...
పాలసీ తీసుకునేటప్పుడే నామినీ వివరాలు తప్పకుండా ఇవ్వాలి. అంతేకాక పాలసీ తీసుకున్న తర్వాత వాటి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియచేయాలి. ఒకవేళ పాలసీదారుడి కంటే నామినీ ముందుగా మరణిస్తే వేరే నామినీ వివరాలను అప్‌డేట్ చేయించడం మర్చిపోవద్దు.
ధ్రువీకరణ పత్రాలుండాలి
ఏదైనా క్లెయిమ్‌కు దాఖలు చేసేటప్పుడు దానికి సంబంధించిన అన్ని అధీకృత పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికెట్, ఒకవేళ ఏదైనా చికిత్స తీసుకుంటే వాటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
సకాలంలో తెలియచేయండి
క్లెయిమ్ త్వరగా పూర్తి కావడానికి ఆ సమాచారాన్ని ఎంత త్వరగా కంపెనీకి చేరవేశారనేది కూడా ముఖ్యం. అందుకే నిర్దేశిత కాలంలోగా క్లెయిమ్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు అవసరమైన అన్ని కాగితాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
వీటితో పాటు పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలించడం మర్చిపోవద్దు. పాలసీ తీసుకుంటున్న బీమా కంపెనీ గత ఐదేళ్ల నుంచి క్లెయిమ్ పరిష్కారం ఏవిధంగా చేసిందనేది చూడాలి. క్లెయిమ్ సెటిల్‌మెంట్ తక్కువగా ఉన్న కంపెనీలకు దూరంగా ఉండటమే మంచిది. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు క్లెయిమ్ పరిష్కారాన్ని సరళతరం చేసే పనిలో ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా క్లెయిమ్ చెల్లింపులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయి.