హెచ్‌పీసీఎల్‌ చేతికి ఎమ్‌ఆర్‌పీఎల్‌ ! | HPCL may acquire MRPL in cash, share-swap deal | Sakshi
Sakshi News home page

హెచ్‌పీసీఎల్‌ చేతికి ఎమ్‌ఆర్‌పీఎల్‌ !

Published Tue, Jan 23 2018 1:35 AM | Last Updated on Tue, Jan 23 2018 1:35 AM

HPCL may acquire MRPL in cash, share-swap deal - Sakshi

న్యూఢిల్లీ: మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ (ఎమ్‌ఆర్‌పీఎల్‌) కంపెనీని కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు హెచ్‌పీసీఎల్‌ వెల్లడించింది.  నగదు, షేర్ల మార్పిడి రూపేణా ఎమ్‌ఆర్‌పీఎల్‌ను కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ముకేశ్‌ కుమార్‌ సురానా చెప్పారు.

కాగా హెచ్‌పీసీఎల్‌ను ఓఎన్‌జీసీ రూ.36,915 కోట్లకు కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ టేకోవర్‌ తర్వాత ఓఎన్‌జీసీకి రెండు రిఫైనరీ అనుబంధ సంస్థలు– హెచ్‌పీసీఎల్, ఎమ్‌ఆర్‌పీఎల్‌లు ఉంటాయి. హెచ్‌పీసీఎల్‌ను స్వతంత్ర లిస్టెడ్‌ కంపెనీగా కొనసాగించాలని, డౌన్‌స్ట్రీమ్‌ విభాగాలన్నింటినీ హెచ్‌పీసీఎల్‌ నేతృత్వంలోకి తీసుకురావాలని కూడా ఓఎన్‌జీసీ యోచిస్తోంది.

త్వరలో విలీన నిర్ణయం..
హెచ్‌పీసీఎల్‌లో ఎమ్‌ఆర్‌పీఎల్‌ విలీనాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవలే ఓఎన్‌జీసీ సీఎండీ శశి శంకర్‌ కూడా చెప్పారు. రెండు కంపెనీల బోర్డ్‌లు దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు. ఎమ్‌ఆర్‌పీఎల్‌లో ఓఎన్‌జీసీకి 71.63 శాతం వాటా ఉండగా, హెచ్‌పీసీఎల్‌కు 16.96 శాతం వాటా ఉంది.

సోమవారం నాటి ట్రేడింగ్‌ ధరతో పోలిస్తే ఓఎన్‌జీసీ వాటా షేర్లను హెచ్‌పీసీఎల్‌ రూ.16,000 కోట్లకు కొనుగోలు చేయవచ్చు. లేదా షేర్ల మార్పిడి రూపంలో అయినా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఎమ్‌ఆర్‌పీఎల్‌లో వాటాను వదులుకోవడం ద్వారా మరిన్ని హెచ్‌పీసీఎల్‌ షేర్లను ఓఎన్‌జీసీ పొందే అవకాశాలుంటాయి. ఇక మూడో ఆప్షన్‌.. ఈ రెండింటిని కలగలపడం.. ఇదే అత్యుత్తమమైన మార్గమని సురానా చెబుతున్నారు.

మూడో రిఫైనరీ...
హెచ్‌పీసీఎల్‌కు ఎమ్‌ఆర్‌పీఎల్‌ మూడో రిఫైనరీ అవుతుంది. ఇప్పటికే హెచ్‌పీసీఎల్‌కు ముంబై, విశాఖల్లో రెండు రిఫైనరీలున్నాయి. ఓఎన్‌జీసీలో హెచ్‌పీసీఎల్‌ విలీనం పూర్తయితే. హెచ్‌పీసీఎల్‌కు చెందిన 23.8 మిలియన్‌ టన్నుల వార్షిక రిఫైనరీ సామర్థ్యం ఓఎన్‌జీసీ పరమవుతుంది. 15 మిలియన్‌ టన్నుల ఎమ్‌ఆర్‌పీఎల్‌ రిఫైనరీ సామర్థ్యాన్ని కూడా కలుపుకుంటే,  భారత్‌లో మూడో అతి పెద్ద ఆయిల్‌ రిఫైనరీగా (రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ) ఓఎన్‌జీసీ అవతరిస్తుంది.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఎమ్‌ఆర్‌పీఎల్‌ తమ చేతికి వస్తే, హెచ్‌పీసీఎల్‌ మరింత పటిష్టమవుతుందని ముకేశ్‌ కుమార్‌ సురానా చెప్పారు. హెచ్‌పీసీఎల్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న దానికంటే అధికంగా పెట్రోలియం ఉత్పత్తులను విక్రయిస్తోందని, ఎమ్‌ఆర్‌పీఎల్‌ తమ చేతికి వస్తే, ఈ లోటు భర్తీ అవుతుందని వివరించారు. ఎమ్‌ఆర్‌పీఎల్‌ తమకు తెలియని కంపెనీయేమీ కాదని సురానా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement