
న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ మల్టినేషనల్ నెట్‌వర్కింగ్, టెలికమ్యూనికేషన్స్ ఈక్విప్‌మెంట్ అండ్ సర్వీసెస్ కంపెనీ హువావే భారత్‌లోని తన ఉద్యోగులను భారీగా ఇంటికి పంపేసింది. ప్రస్తుతం టెలికాం ఇండస్ట్రీలో నెలకొన్న విలీన కన్సాలిడేషన్‌తో తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించేసింది. వొడాఫోన్-ఐడియా విలీనం, టెలికాం రంగ వ్యాప్తంగా ఆర్థిక ఒత్తిడి నెలకొనడం హువావే ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉద్యోగులు కోతను చూస్తున్నామని, సుమారు 30 శాతం మంది ఉద్యోగులు కంపెనీ నుంచి బయటకి వెళ్లిపోయారని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొంతమంది ఉద్యోగులను ఫీల్డ్ టీమ్స్‌లో మళ్లీ నియమించుకున్నట్టు తెలిసింది.
పనితీరు, నెట్‌వర్క్ నిలిపివేత, టెలికాం వ్యాపారాలు పడిపోవడం వంటి ఆధారంగా ఉద్యోగులను కంపెనీని వీడాలని చెప్పినట్టు ఓ అధికారి చెప్పారు. హువావే ఓ డైనమిక్ సంస్థ అని, ఈ డైనమిక్ తమ వర్క్ పాలసీ నుంచి కూడా రావాల్సి ఉంటుందని హువావే ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జే చెన్ తెలిపారు. మంచి పనితీరు కనబర్చే వారికి తాము అన్ని వనరులు సమకూరుస్తామని, అదే సమయంలో పనిచేయని వారిపై కూడా చర్యలుంటాయని పేర్కొన్నారు. ఉద్యోగుల కోత విధించిన అనంతరం సేల్స్, సప్లయ్ చైన్, ఆర్ అండ్ డీ, నెట్‌వర్క్ ఇంజనీరింగ్ ఫంక్షన్స్ వ్యాప్తగా 8వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రధాన వెండర్లు వొడాఫోన్, ఐడియాలు మేనేజింగ్ సర్వీసులను, నెట్‌వర్క్ సంబంధిత ఆపరేషన్స్ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. రిలయన్స్ జియో మార్కెట్‌లోకి ప్రవేశించిన అనంతరం టెలికాం పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వొడాఫోన్, ఐడియాలు విలీనమవుతున్నాయి. ఈ విలీనం అనంతరం తమకు మరింత స్పష్టత రావాల్సి ఉందని చెన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment