కొరతను అధిగమిస్తేనే.. భవిత
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్టీ మార్కెట్ మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది. మౌలిక, గృహ నిర్మాణ రంగాల్లో నైపుణ్యమున్న సిబ్బంది దొరకడం గగనమవుతోంది. దీంతో ప్రధాన నగరాల్లో భారీ నిర్మాణాలు 12–18 నెలలు ఆలస్యమవుతున్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు వంటివారి కొరత సుమారు 30 శాతం దాకా ఉందని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ, నగరాల్లో పనిచేసే యువత మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడట్లేదు. దీంతో ఒడిశా, బిహార్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారిని మౌలిక, నిర్మాణ రంగాల్లో నియమించుకోక తప్పని పరిస్థితి. అయితే బిహార్ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ జీడీపీ పెరిగితే గనుక.. వీరంతా స్వస్థలాలకు వెళ్లిపోయే అవకాశముంది. వివిధ ప్రభుత్వ పథకాల కారణంగా కార్మికుల కొరత అధికమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
మరేం చేయాలి..
మానవ వనరుల కొరతను అధిగమించడానికి సాంకేతిక పరిజ్ఞానం వైపు వేగంగా అడుగులు వేయాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా నిర్మాణాల్ని చేపట్టేవారికి ప్రభుత్వం పన్ను రాయితీలను, ప్రోత్సాహకాలను అందించాలి. మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం తీసుకుంటే.. సుమారు 40 కిలోలుగా ఉంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 150–200 కిలోలుగా ఉంటుంది. ఉక్కు నిర్మాణాల్ని కడితే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ బెండర్ల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. కేంద్రం, ఉక్కు తయారీ సంస్థలు, నిపుణులు కలసి ఈ తరహా నిర్మాణాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.
నిపుణుల వ్యత్యాసం ఎంతంటే..
ప్రస్తుతం మౌలిక, నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది పనివారు అందుబాటులో ఉండగా.. వీరిలో కేవలం 2 కోట్ల మందికే నైపుణ్యం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా సివిల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్ల విషయానికొస్తే గిరాకీ, సరఫరా మధ్య వ్యత్యాసం 82–86 శాతంగా ఉంది. వచ్చే పదేళ్లలో 40 లక్షల మంది సివిల్ ఇంజినీర్లు అవసరముంటుంది. ఇందుకుగాను ప్రస్తుతం 6.42 లక్షల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. 3.96 లక్షల మంది ఆర్కిటెక్ట్‌ల స్థానంలో 65 వేల మంది, 1.19 లక్షల మంది ప్లానర్ల స్థానంలో 18 వేల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. నిపుణుల కొరతతో పాటు గిరాకీ పెరుగుతూనే ఉంది. మొత్తానికి 2020 నాటికి 45 లక్షల మంది నిపుణులు అవసరముంది. గిరాకీ–సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తగ్గించకపోతే ఆర్ధిక అభివృద్ధి క్షీణిస్తుంది. ఫలితంగా అధిక సొమ్ము చెల్లించి విదేశాల నుంచి నిపుణుల్ని దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.