
జెఫ్ బెజోస్, మాకెంజీ బెజోస్ (ఫైల్)
న్యూఢిల్లీ : ప్రపంచంలో కుబేరుల సంఖ్య పెరిగిపోతోంది. వేల కోట్ల రూపాయలు గల బిలియనీర్ల సంఖ్య 2,816కు చేరుకున్నట్లు 2020 సంవత్సరానికి ‘హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తుల విలువ 11.2 ట్రిలియన్ డాలర్లు. అంటే దాదాపు 800 లక్షల కోట్ల రూపాయలు. ఈ మొత్తం అమెరికా, చైనాలను మినహాయిస్తే ఏ దేశ జీడీపీకన్నా ఎక్కువే! (చదవండి: సంపన్న భారతీయుడు ముకేశే)
గతేడాది ప్రపంచ బిలియనీర్ల సంఖ్య సంఖ్యకు ఈ ఏడాది 346 మంది అదనంగా చేరారు. వాస్తవానికి గతేడాది జాబితా నుంచి 130 మంది బిలియనీర్లు తొలగిపోగా ఈ ఏడాది అదనంగా 479 మంది చేరారు. జాబితా నుంచి తొలగిపోయిన జాబితాలో 16 మంది మృతులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ‘అమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (56) తనకున్న రికార్డును ఈ ఏడాది కూడా నిలబెట్టుకున్నారు. గతేడాది ఆయన నుంచి విడాకులు తీసుకున్న మాకెంజీ బెజోస్ ఈ ఏడాది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరారు. విడాకుల వల్ల ఆమెకు అమెజాన్ నుంచి దాదాపు రెండు కోట్ల షేర్లు రావడమే అందుకు కారణం. జనవరి 31వ తేదీ నాటికి బిలియనీర్ల ఆదాయం గతేడాదితో పోలిస్తే 16 శాతం పెరిగింది.
చైనాలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండగా, టాప్ టెన్‌లో మాత్రం ఏడుగురు అమెరికన్లు ఉన్నారు. 84 బిలియన్ డాలర్లతో ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (35), 68 బిలియన్ డాలర్లతో గూగుల్ వ్యవస్థాపకులు (46) సెర్గీ బిన్, 67 బిలియన్ డాలర్లతో లారీ పేజ్ (46)లు, 67 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్ (63) తదితరులు టాప్ టెన్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment