న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్) తమ వాహనాల రేట్లను సుమారు 2 శాతం దాకా పెంచనున్నట్లు తెలిపింది. పెరిగే రేట్లు జూన్ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ముడి వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాలను తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హ్యుందాయ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు.
కమోడిటీల రేట్లు, రవాణా ఖర్చులు, కొన్ని పరికరాలపై కస్టమ్స్ సుంకాలు పెరగడం తదితర ప్రతికూల పరిణామాలన్నింటినీ గత కొన్నాళ్లుగా కంపెనీయే భరిస్తోందని, అయితే ప్రస్తుతం తప్పని పరిస్థితుల్లో ధరల పెరుగుదలను కొంత మేర కస్టమర్లకు బదలాయించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా ప్రవేశపెట్టిన ఎస్‌యూవీ క్రెటా ధరల్లో మాత్రం ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు. దీని రేటు రూ. 9.44 లక్షల నుంచి రూ. 15,03 లక్షల దాకా (ఢిల్లీ ఎక్స్‌షోరూం రేటు) ఉంది. హ్యుందాయ్ ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ చిన్న కారు ఇయాన్ నుంచి ప్రీమియం ఎస్‌యూవీ టక్సన్ దాకా వివిధ వాహనాలను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ. 3.3 లక్షల నుంచి రూ. 25.44 లక్షల దాకా (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ రేటు) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment