18 సంస్థలు.. రూ. 1,150 కోట్ల బాకీలు
► పన్ను ఎగవేతదారుల మూడో జాబితా విడుదల
► లిస్టులో హైదరాబాద్‌కి చెందిన నెక్సాఫ్ట్ ఇన్ఫోటెల్
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారుల పేర్లను బహిర్గతం చేసి, అవమానపర్చడం (నేమ్ అండ్ షేమ్) ద్వారా బకాయిలను రాబట్టే ప్రయత్నాల్లో భాగంగా ఆదాయ పన్ను విభాగం తాజాగా 18 సంస్థలు, వ్యక్తుల పేర్లతో బుధవారం మూడో జాబితా విడుదల చేసింది. ఈ సంస్థలు రూ. 1,150 కోట్ల మేర పన్నులు బాకీపడ్డాయి. వీటిలో హైదరాబాద్‌కి చెందిన నెక్సాఫ్ట్ ఇన్ఫోటెల్ (రూ. 68.21 కోట్లు)తో పాటు పలు పసిడి, వజ్రాల వ్యాపార సంస్థలు ఉన్నాయి.
ముంబైకి చెందిన దివంగత ఉదయ్ ఎం ఆచార్య, ఆయన వారసులు అమూల్ ఆచార్య, భావన ఆచార్య అత్యధికంగా రూ. 779.04 కోట్ల మేర ఆదాయ/కార్పొరేట్ పన్నులు బకాయిపడ్డారు. 1989-90 నుంచి 2013-14 మధ్య కాలంలో అసెస్‌మెంట్ సంవత్సరాలకు గాను ఆదాయ పన్ను విభాగం ఈ జాబితాను రూపొందించింది.
జాడ లేకుండా పోయిన లేదా చెల్లించేందుకు తగినంత ఆస్తులు లేని సంస్థలు ఈ లిస్టులో ఉన్నాయి. ఆదాయ పన్ను విభాగం దీన్ని రూపొందించగా, ఆర్థిక శాఖ జాతీయ దినపత్రికలకు విడుదల చేసింది. ఎగవేతదారులు, రికార్డుల్లో ఉన్న చిరునామా, పాన్ నంబర్లు, బకాయి మొత్తాలు, ఆదాయ మార్గం, అసెస్‌మెంటు సంవత్సరాలు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చడం జరిగింది. ఇందులోని చాలా మటుకు సంస్థలు ఆభరణాలు, వజ్రాలు, పసిడి వ్యాపారాలను ఆదాయ మార్గాలుగా చూపించాయి. 18 మంది డిఫాల్టర్లు వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ ఎగవేసిన మొత్తం రూ. 1,152.52 కోట్ల మేర ఉంది. ఇప్పటికే దాదాపు రూ. 2,000 కోట్ల మేర ఎగవేసిన డిఫాల్టర్లకు సంబంధించి గతంలో రెండు జాబితాలను ఆదాయ పన్ను శాఖ విడుదల చేసింది.