ఐసీఐసీఐ బ్యాంక్ షేరు విభజన
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్ షేరును 1:5 నిష్పత్తిలో విభజించేందుకు డెరైక్టర్ల బోర్డు మంగళవారం ఆమోదముద్ర వేసింది. అంటే రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరును రూ.2 ముఖ విలువగా 5 షేర్లుగా విడగొట్టనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత ఇదే తొలి షేరు విభజన కావడం గమనార్హం.
షేర్ల లావాదేవీల్లో లిక్విడిటీ(సరఫరా) పెంచడమే ఈ చర్యల లక్ష్యమని బ్యాంక్ వివరించింది. కాగా, ఒక్కో అమెరికన్ డిపాజిటరీ షేరు(ఏడీఎస్) ఇప్పుడున్నట్లుగానే రెండు ఐసీఐసీఐ షేర్లకు సమానంగా కొనసాగనుందని... అయితే, తాజా విభజనతో అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్(ఏడీఆర్) హోల్డర్ వద్ద నున్న ఒక్కో ఏడీఎస్‌కు ఈక్విటీ షేర్ల సంఖ్య 10కి పెరగనుందని ఐసీఐసీఐ వెల్లడించింది.
వాటాదారులు, ఇతర నియంత్రణపరమైన అనుమతులకు లోబడి షేర్ల విభజన అమల్లోకి వస్తుందని.. దీనికి సంబంధించి రికార్డు తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. కాగా, మంగళవారం ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర బీఎస్‌ఈలో 1.31 శాతం (రూ.20.50) నష్టంతో రూ.1,547.70 వద్ద స్థిరపడింది.