
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.198 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.56 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు ఐడీబీఐ బ్యాంక్ తెలియజేసింది. మొండి బకాయిలు, కేటాయింపులు కూడా దాదాపు రెట్టింపు కావడం వల్ల ఈ క్యూ2లో ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, జి.ఎమ్. యద్వాద్‌కర్ చెప్పారు.
అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే బ్యాంక్ నికర నష్టాలు తగ్గాయని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, జి.ఎమ్. యద్వాద్‌కర్ చెప్పారు. ఈ క్యూ1లో రూ.853 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయని వివరించారు. గత క్యూ2లో రూ.8,387 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.8,298 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు.
25 శాతానికి మొండి బకాయిలు...
స్థూల మొండి బకాయిలు 13.05 శాతం నుంచి 24.98 శాతానికి, నికర మొండి బకాయిలు 8.32 శాతం నుంచి 16.06 శాతానికి పెరిగాయి. ఫలితంగా కేటాయింపులు రూ.920 కోట్ల నుంచి రూ.1,276 కోట్లకు, మొత్తం కేటాయింపులు రూ.1,349 కోట్ల నుంచి దాదాపు రెట్టింపై రూ.3,257 కోట్లకు పెరిగాయని వివరించింది. ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 4% తగ్గి రూ.63కు పడిపోయింది.