
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐడియా సెల్యులర్‌కు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ3లో రూ.384 కోట్ల నష్టాలు రాగా, ఈ క్యూ3లో రూ.1,284 కోట్ల నష్టాలు వచ్చాయని ఐడియా తెలిపింది. కాల్ కనెక్షన్ చార్జీలు భారీగా తగ్గడం, టారిఫ్‌ల ఒత్తిడి ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించింది. ఆదాయం రూ.8,668 కోట్ల నుంచి 25 శాతం తగ్గి రూ.6,510 కోట్లకు చేరిందని పేర్కొంది. గత క్యూ3లో రూ.1,501 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ3లో రూ.1,223 కోట్లకు తగ్గిందని వివరించింది.
ఇంటర్ కనెక్షన్‌యూసేజీ (ఐయూసీ) చార్జీలను ప్రభుత్వం 57 శాతం తగ్గించడం వల్ల ఆదాయం రూ.820 కోట్లు, ఇబిటా రూ.230 కోట్ల చొప్పున తగ్గాయని ఐడియా పేర్కొంది. ఐయూసీ చార్జీల కోత గత ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిందని, అందుకని ఈ క్యూ3, గత క్యూ3 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. వొడాఫోన్ విలీనం తుది దశకు చేరిందని, ఈ ఏడాది జూన్‌కల్లా విలీనం పూర్తవుతుందని తెలిపింది. నిరుత్సాహకరమైన ఫలితాల ప్రభావంతో ఐడియా షేర్ 5.3 శాతం నష్టంతో రూ.94 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment