ఐడీఎఫ్‌సీ గ్రూపు, శ్రీరామ్ గ్రూపు కంపెనీల భారీ స్థాయి విలీనం అటకెక్కిపోవటంపై మార్కెట్ వర్గాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. విలీనం జరిగితే ఎవరికి లబ్ధి కలిగి ఉండేది? జరగకపోవటం వల్ల ఎవరికి లాభం? వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. దీనిపై కొన్ని సానుకూల స్వరాలు వినిపిస్తుండగా... కొన్ని ప్రతికూల విశ్లేషణలూ వినపడుతున్నాయి. ఎవరి వాదనెలా ఉన్నా... విలీనం జరిగితే దేశంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ తర్వాత ఐడీఎఫ్‌సీ సైతం ఆర్థిక సేవల దిగ్గజ గ్రూపుగా అవతరించి ఉండేది. ఇపుడా అవకాశం చేజారిన నేపథ్యంలో తాజా పరిణామం ఎవరికి లాభిస్తుందో చూద్దాం...
విలీనం జరిగి ఉంటే...: ఐడీఎఫ్‌సీ– శ్రీరామ్ హోల్డింగ్ కంపెనీ అనేది అన్నింటికీ ప్రమోటింగ్ కంపెనీగా ఉండేది. ఐడీఎఫ్‌సీ బ్యాంకులో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ విలీనమయ్యేవి. అయితే ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కొన్నాళ్లు అనుబంధ లిస్టెడ్ కంపెనీగా కొనసాగి, తర్వాత కాలంలో విలీనం కావడం లేదా డీలిస్టింగ్ చేయడమో జరిగి ఉండేది. శ్రీరామ్ గ్రూపు బీమా వ్యాపారాలు ఐడీఎఫ్‌సీలో విలీనమయ్యేవి. ఇపుడివన్నీ నిలిచిపోయాయి.
ఐడీఎఫ్‌సీ బ్యాంకుకు నష్టమేనా?
పేరెంట్ కంపెనీ ఐడీఎఫ్‌సీ నుంచి ఐడీఎఫ్‌సీ బ్యాంకుగా బయటకు వచ్చినప్పటికీ మొత్తం రుణాల్లో ఇన్‌ఫ్రా రంగానికిచ్చినవే 50 శాతానికిపైగా ఉన్నాయి. దీంతో ఎన్‌పీఏలూ ఎక్కువే. ఈ ముద్ర నుంచి బయటకు రావాలన్నది ఐడీఎఫ్‌సీ బ్యాంకు ప్రయత్నం. ప్రస్తుతం బ్యాంకు రుణాల్లో రిటైల్ రంగ వాటా 24 శాతంగా ఉంది. కస్టమర్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంతో ఇటీవలి కాలంలో మైక్రో ఫైనాన్స్ సంస్థ గ్రామ విదియాల్‌ను కొనుగోలు చేసింది.
శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌నూ విలీనం చేసుకుంటే గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఆ సంస్థకు భారీ సంఖ్యలో ఉన్న చిన్న కస్టమర్లు ఐడీఎఫ్‌సీ బ్యాంకుకు సొంతమై ఉండేవారు. చిన్న, మధ్య స్థాయి సంస్థల రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, బంగారం, గృహ రుణాలతో ఐడీఎఫ్‌సీ రిటైల్ రుణ విభాగంలో బలోపేతమై ఉండేది. దక్షిణాదికే పరిమితమైన శ్రీరామ్ గ్రూపు తో పోలిస్తే ఐడీఎఫ్‌సీ బ్యాంకు భిన్నమైన సంస్థ. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విలీనానికి ఏళ్లు పట్టేదని విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే విలీనం రద్దు ఐడీఎఫ్‌సీకి నష్టమేనన్న వ్యాఖ్యలూ వెలువడుతున్నాయి.
పిరమల్స్ వాటాలతోనే సమస్య?
పిరమల్ గ్రూపునకు శ్రీరామ్ సిటీ గ్రూపు కంపెనీల్లో భారీ వాటాలున్నాయి. విలీనమై ఉంటే ఐడీఎఫ్‌సీ బ్యాంకులో పిరమల్ గ్రూపునకు 5%కి పైగా వాటా దక్కేది. దీంతో విలీనానికి ఆర్‌బీఐ అడ్డుచెప్పొచ్చని మొదట్లోనే ప్రశ్నలొచ్చాయి. ఆర్‌బీఐ అంగీకరిస్తేనే ముందుకెళ్తామని ఇరు సంస్థలూ అప్పట్లో చెప్పాయి. శ్రీరామ్ సిటీ యూనియన్, ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్‌ల మాతృ సంస్థ శ్రీరామ్ క్యాపిటల్‌లో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు 20% వాటా ఉంది.
దీనికి అదనంగా అజయ్ పిరమల్‌కు ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్‌లో 10% వాటా ఉంది. శ్రీరామ్ సిటీ యూని యన్‌లో శ్రీరామ్ క్యాపిటల్‌కు 33.37% వాటా ఉంది. దీంతో శ్రీరామ్ సిటీ యూనియన్‌లో పిరమల్ గ్రూపు వాటా 16.7%. ఈ డీల్ విలువ 2016–17 ఏడాది శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ పుస్తక విలువకు 3.5 రెట్ల స్థాయిలో లేకుంటే ఆ సంస్థ వాటాదారులకు నష్టమేనన్న విశ్లేషణలు అప్పట్లోనే వినవచ్చాయి. చివరికి ఆ విలువపైనే ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాలేక, ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం గమనార్హం.
హమ్మయ్య! వాటాదారులకు మేలే!!
‘‘డీల్ జరిగితే నాలుగు లిస్టెడ్ కంపెనీల్లో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ వాటాదారులకు మెరుగైన ప్రతిఫలం దక్కి ఉండేది కాదు. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిస్టింగ్‌ను కొనసాగిస్తే దాని వాటాదారుల పరిస్థితీ అంతే. ఐడీఎఫ్‌సీ బ్యాంకు వాటాదారులకు మాత్రం విలీన నిష్పత్తిని బట్టి లబ్ధి కలిగి ఉండేది. దీర్ఘకాలంలో ఇరు సంస్థల ఏకీకరణ సాఫీగా సాగి, డిపాజిట్లు రుణాల పరంగా సమతుల్యత సాధిస్తే అప్పుడు ఇరు సంస్థల వాటాదారులకూ లాభం జరిగి ఉండేది.
అన్ని కంపెనీలకు హోల్డింగ్ సంస్థగా ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ వాటాదారులు బాగా లబ్ధి పొందేవారు. డీల్ రద్దు కావటంతో మొత్తంగా శ్రీరామ్ గ్రూపు వాటాదారులకు మేలే జరిగిందని చెప్పవచ్చు’’ అనేది విశ్లేషకుల మాట. డీల్ ముందుకు సాగకపోవటంతో కొన్నాళ్లుగా దీనిపై నీలినీడలు కమ్ముకున్నా... సోమవారం మార్కెట్ ముగిసిన తరవాతే డీల్ రద్దు నిర్ణయం వెలువడింది. దీంతో మంగళవారం ఏ గ్రూపు షేర్లు ఎలా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది.
ఐడీఎఫ్‌సీ, శ్రీరామ్ గ్రూప్ విలీనం లేనట్లే...
న్యూఢిల్లీ: ఐడీఎఫ్‌సీ గ్రూప్, శ్రీరామ్ గ్రూప్ మధ్య విలీన ప్రతిపాదన అటకెక్కింది. కంపెనీల విలువను నిర్ణయించటం, దానికి తగ్గ మార్పిడి నిష్పత్తిని నిర్ణయించటంపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాలేకపోవడమే ఇందుకు కారణం.
‘విలీనానికి సంబంధించి ఐడీఎఫ్‌సీ గ్రూప్, శ్రీరామ్ గ్రూప్‌లు రెండూ ఇరువురికీ ఆమోదయోగ్యమైన షేర్ల మార్పిడి నిష్పత్తిని నిర్ణయించలేకపోయాయి‘ అని ఐడీఎఫ్‌సీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. దీంతో ప్రతిపాదిత విలీనంపై చర్చలు నిలిపివేయాలని రెండు సంస్థలు నిర్ణయించినట్లు తెలిపింది. శ్రీరామ్ గ్రూప్‌లో ప్రధానంగా 3 లిస్టెడ్ సంస్థలు శ్రీరామ్ అసెట్ మేనేజ్‌మెంట్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ ఉన్నాయి.
అలాగే జనరల్ ఇన్సూరెన్స్, జీవిత బీమా వ్యాపారం కూడా ఉంది. జులై 8 నాటి ప్రకటన ప్రకారం బీమా సంస్థలతో పాటు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ ఐడీఎఫ్‌సీకి అనుబంధ కంపెనీలుగా మారాల్సి ఉంది. ఇక శ్రీరామ్ సిటీ యూనియన్‌ని ఐడీఎఫ్‌సీలో పూర్తిగా విలీనం చేసి... అనుబంధ లిస్టెడ్ సంస్థగా ఇరు గ్రూప్‌ల నిర్వహణలో ఉన్నవ్యాపారాలు ఐడీఎఫ్‌సీ కిందికి వచ్చేవి.
Comments
Please login to add a commentAdd a comment