
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఐక్యరాజ్యసమితి నిరాశాపూరిత నివేదిక విడుదల చేసింది. 2019లో ఈ వృద్ధి రేటు కేవలం 3 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంచనాలను 3.7 శాతం (అక్టోబర్ అంచనా) నుంచి 3.5 శాతానికి తగ్గించింది. అయితే అంతకన్నా తక్కువ వృద్ధి రేటును ఐక్యరాజ్యసమితి అంచనావేస్తుండడం గమనార్హం. 2018లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.1 శాతంకన్నా కూడా ఇది తక్కువ కావడం మరో అంశం. వాణిజ్య యుద్ధం తీవ్రతలు, గుత్తాధిపత్య ధోరణులు, పలు దేశాల రుణ భారాలు, పర్యావరణ సమస్యల వంటివి 2019లో ప్రపంచం ముందు ఉన్న సవాళ్లని ఐక్యరాజ్యసమితి నివేదిక వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
►ఐక్యరాజ్యసమితిలో ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ, వాణిజ్య అభివృద్ధి వ్యవహారాల శాఖ, ఐదు ప్రాంతీయ ఆర్థిక కమిషన్లు సంయుక్తంగా ఈ 218 పేజీల నివేదికను రూపొందించాయి.
► జరుగుతున్న వృద్ధిలోసైతం అసమానతలు ఉన్నాయి. వృద్ధి ఫలలూ అతి పేద దేశాలకు చేరడం లేదు.
►పర్యావరణ సమతౌల్యం, పేదరిక నిర్మూలనకు నిధుల సమకూర్చుకోవడం, అసమానతలు రూపుమాపడం వంటి కార్యక్రమాలకు ప్రపంచదేశాల ఉమ్మడి కృషి అవసరం.
►ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 2018లో 6.6 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. 1990 తరువాత ఇంత పేలవ స్థాయి వృద్ధిని నమోదుచేసుకోవడం చైనాకు ఇదే తొలిసారి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగే వీలుంది. 2019లో వృద్ధి రేటు 6.3 శాతానికి పడిపోవచ్చు.
ఐఎంఎఫ్ లెక్కింపు విధానం వేరు...
ప్రపంచ వృద్ధి రేటు విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఐక్యరాజ్యసమితి మధ్య వ్యత్యాసం ఉంది. విభిన్న విశ్లేషణా విధానాలను రెండు సంస్థలూ అవలంభించడమే దీనికి కారణం. చైనా, భారత్, కొన్ని అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి విషయంలో ఐఎంఎఫ్ వెయిటేజ్ ఐక్యరాజ్యసమితి వెయిటేజ్‌తో పోల్చితే కొంత అధికం. అర శాతం మేర అంచనాల్లో తేడాలు రావడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి.
– డాన్ హోలెండ్ ఐరాస ప్రపంచ ఆర్థిక పర్యవేక్షణావిభాగం చీఫ్
Comments
Please login to add a commentAdd a comment