ముంబై : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు మరో షాక్ తగిలింది. అక్రమంగా తన అకౌంట్‌లోకి వేసుకున్న వంట గ్యాస్ సబ్సిడీ మొత్తాలను వెంటనే వెనక్కి ఇచ్చేయడంటూ ఎయిర్‌టెల్‌ను ప్రభుత్వ ఆయిల్ కంపెనీ హిందూస్తాన్ పెట్రోలియం ఆదేశించింది. కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు లేదా ఆయిల్ కంపెనీలకు ఈ సబ్సిడీలను బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. లక్షల కొద్దీ కస్టమర్ల ఎల్‌పీజీ సబ్సిడీ మొత్తాలను, ఎయిర్‌టెల్ ఎలాంటి అనుమతి లేకుండా తన పేమెంట్స్ బ్యాంకు అకౌంట్‌లోకి మరలించుకుంటుందని వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హిందూస్తాన్ పెట్రోలియం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింకింగ్ కోసం వచ్చిన ఎయిర్‌టెల్ ఖాతాదారుల రిక్వెస్ట్‌లను వారికి తెలియకుండానే ఆధార్ నెంబర్ల సహాయంతో పేమెంట్ అకౌంట్లని సృష్టించింది. అలా సృష్టించడమే కాకుండా సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ బుక్ చేసినప్పుడు వినియోగదారునికి అందాల్సిన సబ్సిడీని ఎయిర్ టెల్ పేమెంట్ ఖాతాలో చేరేలా చేసింది. వాస్తవానికి ఎయిర్‌టెల్ ఖాతాదారులు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని ఇతర బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసినా.. ఆ ఖాతాలకు కాకుండా సబ్సిడీ మొత్తం ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు ఖాతాల్లో పడేలా అక్రమాలకు పాల్పడింది.
''ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు మేము లేఖ రాశాం. కస్టమర్ల గ్యాస్ సబ్సిడీ మొత్తాలను కస్టమర్లకు చెందిన అంతకముందు బ్యాంకు అకౌంట్లకు లేదా సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించాం'' అని హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. గత కొన్ని వారాలుగా ఎల్‌పీజీ సబ్సిడీ అనుసంధానించిన తమ బ్యాంకు అకౌంట్‌లలోకి సబ్సిడీలు రావడం లేదని సోషల్ మీడియా, ప్రింట్ వంటి ఛానల్స్ ద్వారా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎలాంటి సమాచారం లేకుండా 23 లక్షలకు పైగా కస్టమర్ల రూ.47 కోట్ల ఎల్‌పీజీ సబ్సిడీని ఎయిర్‌టెల్ తన పేమెంట్స్ బ్యాంకులోకి క్రెడిట్ చేసుకుందని జూన్‌లోనే రిపోర్టులు వెలువడ్డాయి. వీరిలో 11 లక్షల ఎల్‌పీజీ కస్టమర్లు ఇండియన్ ఆయిల్‌కు చెందిన వారు కాగ, మిగతా వారు భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియంకు చెందిన కస్టమర్లు. కస్టమర్ల అనుమతి లేకుండా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు అకౌంట్లను ప్రారంభిస్తుందని ఆయిల్ కంపెనీలు కూడా గుర్తించాయి. అంతేకాక ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టకుండా భారతీ ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుపై యూఐడీఏఐ నిషేధం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment