టప..టపా..!
- యూరప్ మార్కెట్ల ప్రభావం
- చివరి రెండు గంటల్లో అమ్మకాల వెల్లువ
- సెన్సెక్స్ 541 పాయింట్లు డౌన్; 26 వేల దిగువకు
- 165 పాయింట్ల నష్టంతో 7,812కు నిఫ్టీ
యూరప్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలవడంతో మంగళవారం మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్లో అకస్మాత్తుగా పతనం ప్రారంభమైంది. అప్పటివరకూ స్వల్పలాభాలతో ట్రేడైన స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో భారీగా నష్టపోయింది. యూరోప్ మార్కెట్లో అమ్మకాలు పోటెత్తడం, అమెరికా డోజోన్స్ ప్యూచర్స్ భారీ నష్టాలతో ట్రేడవడం, మన వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ తగ్గించడంతో మన మార్కెట్లో కూడా ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు.
డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 66 స్థాయికి పడిపోవడం, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, లాభాల స్వీకరణ, ఫెడ్ రేట్ల పెంపుపై అనిశ్చితి కూడా ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 26 వేలు, నిఫ్టీ 7,900 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 541 పాయింట్లు క్షీణించి 25,652 పాయింట్ల వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు క్షీణించి 7,812 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు సూచీలూ 2.07 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. చివరి రెండు గంటల్లో అమ్మకాలు పోటెత్తాయి. బ్యాంక్, ఇన్‌ఫ్రా, లోహ షేర్లు బాగా నష్టపోయాయి. డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు.
- ఇంట్రాడేలో సెన్సెక్స్ 607 పాయింట్లు. నిఫ్టీ 189 పాయింట్ల చొప్పున పడిపోయాయి. ఇంట్రా డే గరిష్ట స్థాయి నుంచి చూస్తే సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల వరకూ పడిపోయింది.
- 30 షేర్ల సెన్సెక్స్‌లోనూ, 50 షేర్ల నిఫ్టీలోనూ నాలుగు షేర్లు(విప్రో, ఇన్ఫీ, మహీంద్రా, సన్‌ఫార్మా)లు మాత్రమే లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో 26 షేర్లు, నిఫ్టీలో 46 షేర్లు నష్టపోయాయి.
- వచ్చే వారం ఆర్‌బీఐ పాలసీ ఉన్న నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు-బ్యాంక్, రియల్టీ, వాహన షేర్లు నష్టపోయాయి.
- లోహాలను అధికంగా వినియోగించే చైనాలో ఆర్థిక మందగమనం చోటుచేసుకుంటుందన్న తాజా ఆందోళనలతో లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్(ఎల్‌ఎంఈ)లో ప్రధాన లోహ ధరలు పతనమయ్యాయి. దీంతో మన స్టాక్ మార్కెట్లో అమ్మకాలు పోటెత్తి లోహ షేర్లు విలవిలలాడాయి. వేదాంత 6.2%, హిందాల్కో 6.2%, కోల్ ఇండియా 5.4%, జిందాల్ స్టీల్ 5%, టాటా స్టీల్ 3%, ఎన్‌ఎండీసీ 2%, సెయిల్ 2% చొప్పున పతనమయ్యాయి.
- ఎన్‌టీపీసీ 4.5%, లార్సెన్ అండ్ టుబ్రో 4.3 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.5%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3.2%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.1 శాతం, టాటా స్టీల్ 3 శాతం చొప్పున తగ్గాయి.
- ఫోక్స్‌వ్యాగన్ వివాదం నేపథ్యంలో టాటా మోటార్స్ 4.79 శాతం క్షీణించింది. ఫోక్స్‌వ్యాగన్‌కు విడిభాగాలు సరఫరా చేసే మదర్సన్ సుమి షేర్ దాదాపు 8 శాతం పడిపోయింది.
- రూ.1,400 కోట్ట జీఎస్‌టీ కాంట్రాక్టును దక్కించుకోవడం, అమెరికాకు చెందిన టీఓఎంఎస్ షూస్ కంపెనీతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇన్ఫోసిస్ పెరిగింది.
- టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,729 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ ఈక్విటీ విభాగంలో రూ.17,421 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,72,191 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,052 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.378 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
- ఆసియా మార్కెట్లు మాత్రం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.
లక్ష కోట్లు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద
సెన్సెక్స్ భారీ పతనంతో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఇన్వెస్టర్ల సంపద) రూ. 1.36 లక్షల కోట్లు తగ్గి రూ.93.33 లక్షల కోట్లకు పడిపోయింది.
పతనం..ప్రధాన కారణాలు
యూరో మార్కెట్ల దెబ్బ: ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు దాదాపు 3 శాతం వరకూ పతనమయ్యాయి. ఫోక్స్‌వ్యాగన్ పర్యావరణ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో దక్షిణ కొరియా దర్యాప్తుకు ఆదేశించడం, యూరప్ వ్యాప్తంగా వాహన కంపెనీలపై దర్యాప్తు చేయాలని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి పిలుపునివ్వడం. డోజోన్స్ ఫ్యూచర్స్ 225 పాయింట్ల వరకూ పతనమవడం, చైనా నుంచి డిమాండ్ తగ్గుతుందన్న ఆందోళనలతో రాగి ధరలు పడిపోవడం, వడ్డీరేట్ల పెంపుపై ఫెడ్ నిర్ణయం తర్వాత డాలర్ పుంజుకొని రెండు వారాల గరిష్ట స్థాయికి చేరడం తదితర అంశాలు ప్రభావం చూపాయి.
చైనా చింత: చైనాలో బలహీనంగా ఉన్న వృద్ధి కారణంగా మిగిలిన ఆసియా దేశాల్లో కూడా మందగమనం చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ హెచ్చరించింది. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆందోళననలు అంతర్జాతీయంగా సెంటిమెంట్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.
ఏడీబీ ఎఫెక్ట్: భారత వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) 7.8 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. వర్షాలు తగినంతగా లేకపోవడం, ఎగమతులకు డిమాండ్ లేకపోవడం, ఆర్థిక సంస్కరణల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆశక్తత వంటి కారణాల వల్ల వృద్ధి అంచనాలను తగ్గించామని ఏడీబీ పేర్కొంది.
ఫెడ్ అనిశ్చితి: రేట్ల పెంపు విషయమై ఫెడరల్ రిజర్వ్ అనిశ్చితి మార్కెట్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. రేట్ల పెంపు ఈ ఏడాదే ఉంటుందని ఫెడ్ ఉన్నతాధికారి ఒకరు, వచ్చే నెలలో ఉండొచ్చని మరొక ఫెడ్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడంతో గందరగోళం, అయోమయం పెరిగిపోతున్నాయని క్రెడిట్ సూసీ అసెట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన రాబర్ట్ పార్కర్ వ్యాఖ్యానించారు.