బంగారంపై జీఎస్‌టీ ఎంత శాతం?
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లులో ప్రధానమైన అంశంపై నేడు (శనివారం) జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్‌టీ మండలి 16వ సమావేశంలో అరుణ్ జైట్లీ, రాష్ట్రాల ఆర్థికమంత్రులు పాల్గొంటున్నారు. జులై1 నుంచి జీఎస్‌టీని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో ఇవాల్టి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా బంగారంపై ఎంత జీఎస్‌టీ ఎంతశాతం ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.
పన్నుల రేట్లు , మిగిలిన సరుకులపై సుంకం, జీఎస్‌టీ డ్రాఫ్ట్, నియమాలు , సవరణలు ఆమోదం తదితర అంశాలు అజెండాలో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలు చాలా కీలకమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. బంగారం బిస్కెట్లు , బీడీల తదితర ఆరు వస్తులపై పన్ను రేట్లను ఈ సమావేశం ఖరారు చేయనుంది.
బంగారంపై 5శాతం జీఎస్‌టీ విధించే అవకాశం ఉందని, అలాగే బిస్కట్లపై 12-18శాతం జీఎస్టీ నిర్ణయించవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా బంగారం అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే 5 శాతం పన్ను ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ రేటు ఉన్న బిస్కట్లపై 12శాతం, మిగిలిన బిస్కట్లపై 18శాతంగా ఉందని అంచనా. అయితే పసిడిపై 4 శాతం పన్ను రేటుతో పాటు ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌలభ్యం కోసం కొన్ని రాష్ట్రాలు
అడుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ప్రస్తుతమున్న 2 శాతం పన్ను కంటే ఎక్కువ భారం పడదని వారు భావిస్తున్నారు. అలాగే 100 కేజీల బిస్కట్లపై ఇంతవరకు కేంద్రం పన్నులేదు... అయితే రాష్ట్రాల వ్యాట్ అమలవుతోంది. దుస్తులను బ్రాండెడ్, బ్రాండెడ్ కానివి అని రెండు విభాగాలుగా వర్గీకరించే అవకాశం ఉందనీ, ప్రస్తుతంతో పోలిస్తే అధికంగా ఉన్నాయని భావిస్తోన్న వివిధ ఉత్పత్తుల పన్నురేట్లను జీఎస్‌టీ మండలి తిరిగి సమీక్షించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.
కాగా గత నెలలో శ్రీనగర్‌లో జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో 1,200కి పైగా వస్తువులు, 500 వరకు సేవలకు నాలుగు శ్లాబుల్లో 5, 12, 18, 28 శాతం చొప్పున రేట్లు నిర్ణయించింది. వీటిల్లో 1,200 వస్తువులు, 500 సర్వీసులను చేర్చింది. అంతేకాకుండా, డెమెరీట్ మరియు లగ్జరీ వస్తువులపై 28 శాతంతో అదనపు సెజ్ కూడా విధించింది. అయితే పసిడి, బిస్కెట్లు, దుస్తులు, పాదరక్షలు, బీడీలు, వ్యవసాయ పరికరాల సహా, విలువైన లోహాలు, ముత్యాలు, విలువైన లేదా సెమీ విలువైన రాళ్ళు, నాణేలు, ఇమిటేషన్ జువెల్లరీపై పన్ను రేట్ల నిర్ణయాన్ని వాయిదా వేసింది. అలాగే పరిశ్రమ వర్గాల ప్రతిపాదనల మేరకు ఇప్పటికే నిర్ణయించిన కొన్ని వస్తువుల పన్ను రేట్లను కమిటీ తిరిగి పరిశీలించనుంది. హైబ్రిడ్ కార్లు, ఆయుర్వేద ఉత్పత్తులపై పన్ను రేట్లను పునఃసమీక్షించాలని ఇప్పటికే వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ ప్రతినిధులు ప్రభుత్వానికి విన్నవించుకున్న సంగతి తెలిసిందే.