
ఆరోనెలా ధరలు రయ్
వరుసగా ఆరోనెలా ధరల పెరుగుదల కొనసాగింది. ఆహారోత్పత్తుల రేట్లు ఎగియడంతో జనవరిలో ద్రవ్యోల్బణం 5.69 శాతంగా నమోదైంది.
♦ జనవరిలో 16 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
♦ 5.69 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: వరుసగా ఆరోనెలా ధరల పెరుగుదల కొనసాగింది. ఆహారోత్పత్తుల రేట్లు ఎగియడంతో జనవరిలో ద్రవ్యోల్బణం 5.69 శాతంగా నమోదైంది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి. 2014 సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణ రేటు 6.46 శాతంగా నమోదైంది. ఇక గతేడాది జనవరిలో ద్రవ్యోల్బణం రేటు 5.19 శాతం కాగా, డిసెంబర్‌లో ఇది 5.61 శాతం. శుక్రవారం కేంద్రీయ గణాంకాల విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం 6.85 శాతం మేర పెరిగింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ధరల పెరుగుదల 6.48 శాతంగాను, పట్టణ ప్రాంతాల్లో 4.81 శాతంగాను ఉంది. ఈ పరిణామాల నడుమ స్థూల ఆర్థిక పరిస్థితుల నిర్వహణ అటు ప్రభుత్వానికి , ఇటు రిజర్వ్ బ్యాంకుకు మరింత కష్టతరం కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ ప్రిన్సిపల్ ఎకానమిస్టు సునీల్‌కుమార్ సిన్హా పేర్కొన్నారు.
విభాగాల వారీగా రేట్ల పెరుగుదల చూస్తే..
♦ మాంసం, చేపల రేట్లు 8.23%, గుడ్ల ధరలు 3.96% పెరిగాయి.
♦ తృణధాన్యాలు మొదలైన వాటి ధరల పెరుగుదల డిసెంబర్‌లో 2.12 శాతంగా ఉండగా జనవరిలో 2.19 శాతానికి చేరింది.
♦ కూరగాయల ధరలు 6.39 శాతం పెరగ్గా.. సీజనల్ ఫలాల రేట్ల పెరుగుదల ప్రతికూలంగా నమోదైంది. వీటి ధరలు 0.24 శాతం తగ్గాయి.
♦ పప్పుధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల రే ట్లు అధికంగానే కొనసాగాయి.