మేలో పారిశ్రామిక ఉత్పత్తి నిరాశ
- ఐఐపీ వృద్ధి రేటు కేవలం 2.7%
- తయారీ రంగం పేలవ పనితీరు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం ఉత్పత్తి మే నెల్లో తీవ్ర నిరాశ పరిచింది. 2014 మే నెలతో పోల్చితే 2015 మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 2.7 శాతం పెరిగింది. గత ఏడాది మే నెలలో ఈ వృద్ధి రేటు 5.6 శాతం. 2015 ఏప్రిల్ రేటు 4.1 శాతం. శుక్రవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన సమాచారం ప్రకారం ముఖ్య రంగాల పనితీరు ఇలా ఉంది...
తయారీ: మేలో వృద్ధి రేటు 5.9 శాతం నుంచి 2.2 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో ఈ రేటు 5.1 శాతంగా ఉంది. కాగా ఏప్రిల్-మే నెలల్లో వృద్ధి రేటు 4.5% నుంచి 3.2 శాతానికి పడింది. మొత్తం ఐఐపీలో ఈ రంగం వాటా దాదాపు 72 శాతం.
మైనింగ్: మే నెలలో వృద్ధి రేటు 2.5 శాతం నుంచి 2.8%కి పెరిగింది. అయితే రెండు నెలల్లో చూస్తే వృద్ధి రేటు 2.1% నుంచి 1.5 శాతానికి పడింది.
విద్యుత్: ఈ రంగంలో మే నెల వృద్ధి రేటు 6.7% నుంచి 6%కి తగ్గగా... ఏప్రిల్-మే నెలల్లో ఈ రేటు భారీగా 9.2 శాతం నుంచి 2.8 శాతానికి జారింది.